ఈటల రాజేందర్‌ దారేటో?

May 12, 2021


img

మాజీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నిన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయిన తరువాత ఇవాళ్ళ టిఆర్ఎస్‌ మాజీ ఎంపీ డీ. శ్రీనివాస్‌తో నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలసేపు సాగిన ఈ భేటీలో డిఎస్ కుమారుడు, బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఈటల రాజేందర్‌ భవిష్య కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. 

తరువాత రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, జితేందర్ రెడ్డి, డికె.అరుణలను, ఆ తరువాత కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి, మరికొందరు కాంగ్రెస్‌ నేతలను కూడా ఈటల రాజేందర్‌ కలువనున్నట్లు తెలుస్తోంది.

ఈటల రాజేందర్‌ కలుస్తున్నవారందరూ సిఎం కేసీఆర్‌ను, టిఆర్ఎస్‌ను...దాని ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారే. అయితే వారందరూ వేర్వేరు పార్టీలలో ఉన్నందున వారి మద్య కూడా చాలా దూరం ఉంది. కనుక వారు కూడా సిఎం కేసీఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కలిసి పనిచేయలేరు. కనీసం పరస్పరం సహకరించుకోలేరు. మరి అటువంటప్పుడు ఈటల రాజేందర్‌ అందరినీ కలవడం వలన కొత్త స్నేహితులు, ఆలోచనలు లభించవచ్చు కానీ అందరినీ కలపలేరని స్పష్టం అవుతోంది. 

అలాగని ఆయన కాంగ్రెస్‌, బిజెపి రెండు పడవలలో కాళ్ళు పెట్టి ప్రయాణించలేరు. కనుక ఆయన ఆ రెండు పార్టీలలో దేనినో ఓ దానిని ఎంచుకొని చేరాల్సి ఉంటుంది లేదా ఒంటరిగా ప్రయాణించవలసి ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే కేసీఆర్‌ను వ్యతిరేకించే పార్టీలు చాలా ఉన్నందున వాటితో ఎన్నికలలో కేసీఆర్‌ వ్యతిరేక ఓట్లు చీలిపోయి మళ్ళీ టిఆర్ఎస్‌కే లబ్ది చేకూరుతోందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కనుక ఒకవేళ ఈటల రాజేందర్‌ మరో కొత్త పార్టీ పెడితే దాని వలన కూడా టిఆర్ఎస్‌కే లబ్ది కలుగవచ్చు. 

అయినా తెలంగాణ ఉద్యమాలలో ముందుండి పోరాడిన ప్రొఫెసర్ కోదండరాంనే ప్రజలు పట్టించుకోనప్పుడు, భూకబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్‌ను ఆదరిస్తారా?    



Related Post