ఈటల పోరాటంలో కలిసొచ్చేదెవరు?

May 12, 2021


img

ఈటల రాజేందర్‌ మంత్రివర్గం నుండి బహిష్కరింపబడటంతో సిఎం కేసీఆర్‌పై యుద్ధానికి సిద్దమవుతున్నారు. రాజకీయాలలో ఈటల, సిఎం కేసీఆర్‌ ఇద్దరూ సమ ఉజ్జీలు కావచ్చు కానీ రాజకీయ వ్యూహాలలో కేసీఆర్‌దే పైచేయి అని అందరికీ తెలుసు. అందుకే ఈటల చాలా ఆచితూచి అడుగులేస్తున్నారు. 

మొదట తన ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని చెప్పిన ఈటల ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సామాజిక తెలంగాణ కోసం పోరాడుతున్నానని చెప్పడం బలం సమకూర్చుకోవడం కోసమేనని చెప్పవచ్చు. అలాగే ప్రతిపక్ష నేతలను కలిసి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.  

కానీ భూకబ్జాల ఆరోపణలను భుజంపై మోస్తున్న ఈటల ప్రజల విశ్వాసాన్ని పొందగలరా?ప్రజలు కేసీఆర్‌ను కాదని ఆయనను నమ్ముతారా?అనే ప్రశ్నలకు రాబోయే రోజులలో సమాధానం లభిస్తుంది. 

ప్రజలు ఆయనను నమ్మినా, నమ్మకపోయినా కాంగ్రెస్‌, బిజెపిలు రెండూ ఆయనను పార్టీలో చేర్చుకొనేందుకు పోటీ పడటం ఖాయంగానే భావించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులలో ఈటల రాజేందర్‌ ఒక్కరే సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌లతో ఒంటరిపోరాటం చేయలేరు కనుక తప్పనిసరిగా ఆ రెంటిలో ఏదో ఓ పార్టీలో చేరక తప్పదు. ఒకవేళ ఆయన కేసీఆర్‌ వ్యతిరేకులందరినీ కూడగట్టి పోరాడుదామనుకొంటే, అప్పుడు ఈటలను నిర్వీర్యం చేసేందుకు కేసీఆర్‌ ప్రత్యేకంగా ఏమీ చేయక్కరలేదు. కాలక్రమంలో ఈటల రాజేందర్‌ కూడా ప్రొఫెసర్ కోదండరాంలాగ నిర్వీర్యం అయిపోవచ్చు.


Related Post