ఈటల అడుగులు కాంగ్రెస్‌ వైపు?

May 11, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఇవాళ్ళ ఉదయం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని భట్టి నివాసానికి వెళ్ళి తనను మంత్రివర్గంలో నుంచి బహిష్కరించడం తదనంతర పరిణామాలపై ఈటల రాజేందర్‌ చర్చించినట్లు తెలుస్తోంది. 

మూడు రోజుల క్రితం సీనియర్ కాంగ్రెస్‌ నేత రాములు నాయక్‌, అంతకు ముందు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒకరి తరువాత మరొకరు ఈటల రాజేందర్‌ నివాసానికి వెళ్ళి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇవాళ్ళ ఈటల స్వయంగా భట్టి విక్రమార్క ఇంటికి వెళ్ళి ఆయనతో భేటీ అవడం గమనిస్తే ఈటల రాజేందర్‌ కాంగ్రెస్ పార్టీవైపు అడుగులు వేస్తున్నారా? అనే సందేహం కలుగక మానదు.

అటువంటి అవకాశం ఉందనే భావింకఃవచ్చు. ఎందుకంటే రాజేందర్‌ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నంతకాలం కాంగ్రెస్ నేతలు ఆయనను తమ రాజకీయ శత్రువుగానే భావిస్తూ కరోనా కట్టడివిషయంలో దారుణంగా విఫలమయ్యారంటూ విమర్శిస్తుండేవారు. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్‌ ప్రభుత్వం నుండి బయటకు వచ్చిన తరువాత సిఎం కేసీఆర్‌ను, టిఆర్ఎస్‌ నేతలు, మంత్రులను లక్ష్యంగా చేసుకొని యుద్ధం చేస్తున్నారు కనుక శత్రువుకి శత్రువు మిత్రుడవుతారనట్లు కాంగ్రెస్ పార్టీకి ఈటల రాజేందర్‌ స్నేహితుడే అవుతారని చెప్పవచ్చు. అదీగాక ఈటల రాజేందర్‌ సిఎం కేసీఆర్‌తో చిరకాలం కలిసి పనిచేసినందున ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలు, లోపాలు, సమస్యలు, టిఆర్ఎస్‌ బలాలు, బలహీనతలు వంటి గుట్టుమట్లన్నీ క్షుణ్ణంగా తెలిసిన విభీషణుడి వంటివారని చెప్పవచ్చు. అటువంటి ఈటల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే దానికి లాభమే తప్ప నష్టం లేదు. సిఎం కేసీఆర్‌ వంటి బలమైన శత్రువును ఎదుర్కోవాలంటే ఈటల రాజేందర్‌ ఒక్కరివల్లే సాధ్యం కాదు. కనుక ఆయన కాంగ్రెస్‌లో చేరవచ్చు లేదా కాంగ్రెస్‌తో కలిసి పనిచేయవచ్చు. అయితే ఇప్పుడే ఈ విదంగా ఊహించడం తొందరపాటే అవుతుంది కానీ భట్టి-ఈటల భేటీ  అటువంటి సూచన ఇస్తున్నట్లు భావించవచ్చు.


Related Post