కరోనాతో కొత్త సమస్య

May 10, 2021


img

కరోనా మహమ్మారే ఓ సమస్య అనుకొంటే, అది తెచ్చిపెడుతున్న సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటి అంత్యక్రియలు. ఆత్మీయులు మరణించారనే బాధతో పాటు వారి అంత్యక్రియలు నిర్వహించడం ఇంకా పెద్ద బాధగా మారింది. ఎక్కడా శ్మశానాలు ఖాళీ లేకపోవడమే అందుకు కారణం. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రంలో మరో కొత్త సమస్య ప్రజలను భయపెడుతోంది. ఉత్తరాది రాష్ట్రాలకు జీవనాడివంటి గంగానదిలో కరోనా రోగుల శవాలను పడేస్తున్నారు. శ్మశానాలు ఖాళీ లేకపోవడం, ఉన్నా అంత్యక్రియలకు వేలాదిరూపాయలు వసూలు చేస్తుండటంతో కొంతమంది కరోనాతో మరణించిన తమ ఆత్మీయుల శవాలను గంగానదిలో విడిచిపెడుతున్నారు. 

బిహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలోని గంగానదిలో చేపలు పట్టే మత్స్యకారులకు ఓ కిలోమీటరు పరిధిలో ఏకంగా 48 కరోనా శవాలు కనిపించడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతూ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ శవాలను బయటకు తీసి దహనసంస్కారాలు చేశారు. యమునా నదిలో కూడా కరోనా శవాలు కొట్టుకువస్తుండటంతో తీర ప్రాంతాలలో నివసించేవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యూపీలోని హామీర్‌పూర్, కాన్పూర్ జిల్లాలలో నిత్యం యమునా నదిలో  కరోనా శవాలు కొట్టుకువస్తున్నాయి. దీంతో ఆ నీళ్ళ ద్వారా తమకూ కరోనా సోకుతుందని తీర ప్రాంత ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

యూపీ, బిహార్‌ రాష్ట్రాలలో కొన్ని కులాలు, తెగలలో ఎవరైనా చనిపోతే వారిని దహనం చేయకుండా నదులలో విడిచిపెడుతుంటారు. ఈ అలవాటు క్రమేపీ తగ్గినప్పటికీ మళ్ళీ ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభించి శ్మశానాలు ఖాళీ లేకపోవడంతో కరోనాతో మరణించినవారి శవాలను నదులలో విడిచిపెడుతున్నారు.


Related Post