అధికారుల బదిలీలలతో ఈటలకు కత్తెర?

May 10, 2021


img

తెలంగాణ ప్రభుత్వంలో కొద్ది రోజుల క్రితం వరకు కీలక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలతో వేటు వేయగానే ఒక్కసారిగా ఆయన పరిస్థితి తారుమారైపోయింది. ఓ పక్క అచ్చంపేట, దేవరయంజాల్ భూకబ్జాలపై నివేదికలు సిద్దం అవుతుంటే, మరో పక్క హుజూరాబాద్‌లో ఈటలకు ఎవరి సహాయసహకారాలు లభించకుండా చేసేందుకు ఆయనకు సన్నిహితులైనవారిని, అనుకూలంగా పనిచేసే అధికారులపై బదిలీల వేటు పడుతోంది. 

ముందుగా ఈటల ముఖ్య అనుచరులలో ఒకరైన పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్‌ పుట్టా మధును హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణిల హత్య కేసులో రామగుండం పోలీసులు అరెస్ట్ చేశారు. 

హుజూరాబాద్‌ ఎస్ఐలు ఏ.రమేష్, సీహెచ్. విద్యాసాగర్, జి. సదన్ కుమార్‌లను కరీంనగర్‌ డిఐజీ కార్యాలయానికి అప్పగించబడ్డారు. వారి స్థానంలో జె.సురేష్, కె.రామచంద్రరావు, వి.శ్రీనివాస్‌లను నియమించబడ్డారు.                   

వామన్ రావు దంపతుల హత్య జరిగిన తరువాత మంధని సర్కిల్‌లో ఇదివరకే కొంతమంది పోలీస్ అధికారులపై బదిలీ వేటు పడింది. ఇప్పుడు మరికొంతమంది పోలీస్ అధికారులు బదిలీ అయ్యారు. 

అయితే ఈటల రాజేందర్‌ కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేదు. టిఆర్ఎస్‌లో సిఎం కేసీఆర్‌ పట్ల అసంతృప్తిగా ఉన్నవారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈవిషయం ఇటీవల ఆయనను కలిసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఒకరిద్దరు మంత్రులతో సహా పలువురు టిఆర్ఎస్‌ నేతలతో తాము టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. కానీ ఈ పరిస్థితులలో ఈటల వెనుక వెళితే ఏమవుతుందో ఈటలను చూస్తేనే అర్ధమవుతుంది కనుక ఇప్పటికిప్పుడు టిఆర్ఎస్‌ నుంచి ఎవరూ బయటకు రాకపోవచ్చు. ఒకవేళ రాబోయే రోజుల్లో సిఎం కేసీఆర్‌ను ఢీకొని నిలబడగలరని ఈటల రాజేందర్‌ నమ్మకం కలిగించగలిగితే అప్పుడు ఎవరైనా ఆయనతో చేతులు కలిపే అవకాశం ఉంది. ఆయనకు అటువంటి అవకాశం కూడా లేకుండా చేసేందుకే టిఆర్ఎస్‌ అధిష్టానం పావులు కదుపుతునట్లు భావించవచ్చు.


Related Post