శాంత బయోటెక్ అధినేత తాజా ఇంటర్వ్యూ

May 08, 2021


img

భారత్‌లో పేరొందిన ప్రముఖ సంస్థలలో శాంత బయోటెక్ కూడా ఒకటి. ఇప్పటివరకు ఆ సంస్థ ఉత్పత్తి చేసిన అనేక రకాల వాక్సిన్లు యావత్ ప్రపంచదేశాలు వాడుతున్నాయి. దేశంలో కరోనా పరిస్థితులపై ఆ సంస్థ అధినేత కెఐ.వరప్రసాదరెడ్డి ఇటీవల ఓ తెలుగు న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 

భారత్‌లో ఈ దుస్థితికి ప్రధాన కారణం పాలకులకు దూరదృష్టి లేకపోవడం... నిర్లక్ష్యమే. వారికి ప్రజల ప్రాణాల కంటే వారి పార్టీలు...రాజకీయాలే ముఖ్యం. అందుకే కరోనాను ఎదుర్కోవడానికి ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా ఎన్నికలు, కుంభమేళా నిర్వహించారు.

డోనాల్డ్ ట్రంప్‌ బఫూన్, తెలివి తక్కువవాడు అని అందరూ అంటారు. కానీ ఆ బఫూన్ మనకంటే చాలా తెలివిగా, దూరదృష్టితో ఆలోచించి ముందే వివిద కంపెనీలకు లక్షల కోట్లు చెల్లించి వాటితో ఒప్పందాలు చేసుకొని అమెరికా జనాభాకు అవసరమైన దానికంటే రెట్టింపు వాక్సిన్లు కొనుగోలు చేసి నిలువ చేసి పెట్టారు. కానీ మన పాలకులకు అటువంటి ముందు చూపు లేకపోగా గొప్పలకు పోయి మొదట తయారైన కొద్దిపాటి వాక్సిన్లను విదేశాలకు సరఫరా చేసి ఇప్పుడు దేశప్రజలకు వాక్సిన్లు అందించలేక చేతులెత్తేస్తున్నారు. 

దేశంలో రెండే రెండు కంపెనీలు కరోనా వాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నాయి. దేశంలో సుమారు 130 కోటలకు పైగా జనాభా ఉన్నారు. ఒక్కొక్కరికీ రెండు డోసుల వ్యాక్సిన్లు ఇవ్వాలంటే మొత్తం 300 కోట్లు వ్యాక్సిన్లు కావాలి. కానీ ఆ రెండు కంపెనీలు నెలకు 8-9 కోట్లు వాక్సిన్లు మాత్రమే తయారుచేయగలవు అంటే దేశ అవసరాలకు సరిపడినని వ్యాక్సిన్లు  అవి అందించలేవని స్పష్టం అయ్యింది.

దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయగల కంపెనీలు చాలానే ఉన్నాయని మన పాలకులకు బాగా తెలుసు. కానీ ఇతర కంపెనీలకు అవసరమైన సహాయసహకారాలు అందజేసి వాటిచేత కూడా వాక్సిన్లు ఉత్పత్తి చేయించి ఉంటే నేడు ఈ దుస్థితి ఎదురయ్యేది కాదు. కానీ మన పాలకులకు ఎంతసేపు దేశమంతటా తమ పార్టీ జెండా రెపరెపలాడాలనే తప్ప ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఆలోచన లేదు. కనీసం తయారై అందుబాటులోకి వచ్చిన వాక్సిన్ల వలన కలిగే మేలు గురించి ప్రజలకు అవగాహన కల్పించలేదు. అందుకే మొదట ఎవరూ వ్యాక్సిన్‌ వేసుకొనేందుకు ఇష్టపడలేదు. 

ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ చనిపోతే వెంటనే ఉపఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఓ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సిలర్ లేదా ఓ సంస్థ ఛైర్మన్‌, సభ్యులు పదవీ విరమణ చేస్తే వారి స్థానాలలో ఎన్ని నెలలు, ఏళ్ళు గడుస్తున్నా కొత్తవారిని నియమించరు. దీనిని బట్టి మన పాలకుల ప్రాధాన్యతలు ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పాలకులు మేల్కొని ఈ లోపాలన్నిటినీ సరిదిద్దుకొంటే భారత్‌ సులువుగా ఈ సమస్యల నుండి బయటపడగలదు,” అని వరప్రసాదరావు అన్నారు.


Related Post