నన్ను దెబ్బ తీయడం ఎవరివల్లా కాదు: ఈటల

May 08, 2021


img

ఈటల రాజేందర్‌ మంత్రివర్గం నుంచి బహిష్కరించబడిన తరువాత హుజూరాబాద్‌లో తన అనుచరులు, తనకు మద్దతు ఇచ్చేవారితో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ తన రాజకీయ బలాన్ని అంచనావేసుకొని ముందుకు సాగేందుకు సిద్దమవుతున్నారు. 

శుక్రవారం మేడ్చల్ మండలం, పూడూర్ గ్రామ పరిధిలోని తన నివాసంలో వీణవంక, కమలాపూర్, ఇల్లంతుకుంట మండలాలకు చెందిన నాయకులతో సమావేశమయ్యారు. ఆయన వారితో మాట్లాడుతూ, “నాపై ఓ పధకం ప్రకారమే ఈ కుట్ర జరిగింది. దీంతో నాకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దామని ప్రయత్నించారు. కానీ మీరు, ప్రజలు నా వెనుక ఉన్నంతకాలం నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. శత్రువు మనకంటే చాలా బలమైనవాడు కనుక చాలా ఆచితూచి అడుగు ముందుకు వేయవలసి ఉంటుంది. అందుకే నేను ఏమాత్రం తొందరపడటం లేదు. అందరితో మాట్లాడి మనతో ఉన్నవారెవరో లేనివారెవరో తెలుసుకొంటున్నాను. కనుక మీరందరూ మరికొన్ని రోజులు ఓపిక పట్టాలి. కాస్త ఆలస్యమైనా అడుగు ముందుకే వేస్తాము తప్ప వెనక్కి తగ్గేది లేదు,” అని ఈటల అన్నారు.       

ఓ వైపు ఈటల రాజేందర్‌ ఈవిదంగా ఆచితూచి అడుగులేస్తుంటే, మరో పక్క టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఆయన భూకబ్జాలపై నివేదికలు సిద్దం చేయిస్తోంది. కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందు కురుపాండవులు సిద్దమైనట్లు టిఆర్ఎస్‌, ఈటల రాజేందర్‌ వర్గం కూడా యుద్ధ సన్నాహాలు చేసుకొని సిద్దమవుతున్నారు.


Related Post