క్యూలైన్లలో దేశ ప్రజలు

May 07, 2021


img

ప్రస్తుతం దేశంలో కరోనా చాలా ఉదృతంగా ఉండటంతో దేశ ప్రజలందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెడుతున్నారు. దీంతో ఎక్కడ చూసిన క్యూలైన్లే కనబడుతున్నాయి. ఇంతకాలం ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా కరోనా సోకకుండా తప్పించుకొంటున్నవారు టీకాలు వేసుకొందామంటే అక్కడా వందలాదిమంది ఉంటారు. అక్కడే వారికి కరోనా అంటుకొనే ప్రమాదం ఉంటుంది. 

కరోనా లక్షణాలు కనిపించగానే భయంతో టెస్టింగ్ కోసం వెళితే అక్కడో పెద్ద క్యూలైన్ ఉంటుంది. 

గతంలో కరోనా రోగులను బందిపోటు దొంగలను పట్టుకొన్నట్లు పోలీసులు, ఆరోగ్యశాఖ కార్యకర్తలు చుట్టుముట్టి అంబులెన్సులలో ఆసుపత్రులకు తరలించేవారు. కానీ ఇప్పుడు ఆసుపత్రులు, క్వారెంటైన్‌ కేంద్రాలు అన్ని నిండిపోవడంతో కరోనా రోగులే బస్సులు, ఆటోలు, కార్లు, బైకులు ఎక్కి ఆసుపత్రులకు చేరుకొంటున్నారు. కరోనా రోగులు లేదా ఆ లక్షణాలున్నావారు బహిరంగ ప్రదేశాలలో యధేచ్చగా తిరిగేస్తూ అందరికీ ఉచితంగా కరోనాను పంచి పెట్టేస్తున్నారు. అందుకే భారత్‌లో రోజుకు 4 లక్షలు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 

కనుక కరోనా ఉన్నవారు, లేనివారు అనే తేడాలు లేవిప్పుడు భారత్‌లో! మీ ముందూ...వెనుకా, చుట్టూ పక్కలా అంతటా కరోనా మహమ్మారి సర్వాంతర్యామిలా వ్యాపించే ఉంది. కనుక మనకి కరోనా లేదు...రాదు అనుకొంటే అంతకంటే అవివేకం మరోటి ఉండదు.       

ఆసుపత్రులకు పరుగు తీస్తే ఎక్కడా బెడ్లు ఖాళీ ఉండవు కనుక బెడ్లు దొరికేవరకు బయట ఆవరణలో ప్రాణాలుగ్గబట్టుకొని క్యూ లైన్లో ఎదురుచూపులు చూడక తప్పదు. ప్రాణాలు పోయేలోగా బెడ్ దొరికితే అదృష్టమే లేకుంటే అక్కడి నుంచి కాటికే! 

బెడ్ దొరికినా దొరకకపోయినా ముందుగా ఆక్సిజన్‌ సిలెండర్ సంపాదించుకోవలసిందే...లేకుంటే ప్రాణాలు ఆ గాల్లోనే కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఆక్సిజన్‌ సిలెండర్ కోసం వెళితే అక్కడా పెద్ద క్యూ ఉంటుంది. 

ఇప్పుడు చచ్చినా సుఖం లేదు ఎందుకంటే చచ్చిన తరువాత కూడా శ్మశానంలో చచ్చినట్లు క్యూలో ఉండాల్సిందే. కనుక ఇప్పుడు చచ్చినా, బ్రతికి ఉండాలన్నా పెద్ద సమస్యే!

కనుక చివరికి తేలిందేమిటంటే ప్రస్తుతం దేశ ప్రజలలో చాలా మంది ఏదో ఓ క్యూ లైన్లో ఉంటున్నారు. ఆ క్యూలైన్లోనే కరోనా భాయ్ కూడా ఉంటాడని మరిచిపోకూడదు.  



Related Post