కేసీఆర్ శత్రువులందరూ ఏకం అవుతున్నారా?

May 07, 2021


img

ఒకరు పార్టీని విడిచి బయటకు వచ్చారు మరొకరిని పార్టీయే బయటకు పంపించింది. వారే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్‌. వారిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ కాంగ్రెస్‌లో ఉండగా సిఎం కేసీఆర్‌ను గద్దె దించడం సాధ్యం కాదని భావించి ఇప్పుడు ఆ పార్టీ నుంచి కూడా బయటకువచ్చారు. ఇప్పుడు ఈటల కూడా సిఎం కేసీఆర్‌పై రగిలిపోతూ భవిష్య కార్యాచరణ గురించి తన అనుచరులు, నియోజకవర్గ ప్రజలతో సమాలోచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరి ఉమ్మడి శత్రువు సిఎం కేసీఆర్‌ కనుక కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యి భవిష్య కార్యాచరణ గురించి చర్చించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ఈటల రాజేందర్‌ నాకు చిరకాల మిత్రుడు. ఆయన భార్య జమున మా బందువు. టిఆర్ఎస్‌లో ఈటలకు ఇంత అవమానం జరుగడంతో మర్యాదపూర్వకంగా వెళ్ళి ఆయనను కలిసి సంఘీభావం తెలిపాను. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా సమర్ధిస్తానని చెప్పాను,” అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. 

ఈటల రాజేందర్‌ను మంత్రివర్గంలో నుంచి బహిష్కరించగానే తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అందరికంటే ముందుగా ఆయనకు సంఘీభావం తెలిపారు. సిఎం కేసీఆర్‌ను వ్యతిరేకిస్తున్నవారందరూ చేతులు కలపాలని విజ్ఞప్తి చేశారు. కొండా, ఈటల భేటీ ఆ దిశలో పడిన తొలి అడుగుగానే భావించాల్సి ఉంటుంది. 



Related Post