బీజేపీ నేతలు వాటి గురించి ఎందుకు మాట్లాడరు?

May 06, 2021


img

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో సహా మిగిలినవారు కూడా కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ విమర్శలు గుప్పిస్తుంటారు. రాష్ట్రంలో పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడు వారు దేశంలో పరిస్థితుల గురించి కూడా మాట్లాడుతుంటే బాగుండేది. దేశంలో ఎక్కడ చూసినా మందులు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్‌, బెడ్లు కొరతతో రోజూ వేలాదిమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. చివరికి చచ్చినా వారి కష్టాలు తీరడం లేదు. ఎందుకంటే శ్మశానాలలో కూడా ఖాళీ ఉండటం లేదు!

దీనికంతటికీ కారణం కేంద్రానికి దూరదృష్టి లోపించడం, సమగ్రమైన విధానాలు రూపొందించుకోలేకపోవడం, కరోనాకు సంబందించి ఏ వ్యవస్థను సమర్ధంగా నిర్వహించలేకపోవమే అని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్ని లోపాలుండగా వాటిని సరిదిద్దుకొనే ప్రయత్నాలు చేయకుండా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించడం, కుంబమేళా నిర్వహించడం ఇంకా పెద్ద పొరపాటని యావత్ ప్రపంచ మీడియా కోడై కూసింది. భారత్‌లో పరిస్థితులు చూసి పాకిస్థాన్‌తో సహా యావత్ ప్రపంచదేశాలు జాలిపడుతున్నాయంటే సిగ్గుతో తలదించుకోవాలి.

మొదట ఇతర దేశాలకు ఉదారంగా వ్యాక్సిన్లను సరఫరా చేసిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు దేశంలో ప్రజలకే వాక్సిన్లు అందజేయలేకపోతోంది. ఇక 18-45 ఏళ్ల వారికి మరో రెండు మూడు నెలల వరకు వాక్సిన్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే 45 ఏళ్ళు పైబడిన వారికి ఇచ్చేందుకు సరిపడినన్ని వాక్సిన్లు లేకపోవడంతో చాలా రాష్ట్రాలలో తరచూ టీకాలు వేసే కార్యక్రమం నిలిచిపోతోంది. 

ఇవన్నీ రాష్ట్ర బీజేపీ నేతలకు తెలియవనుకోలేము. కానీ వీటి గురించి మాట్లాడకుండా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలైన డికె అరుణ, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, రాష్ట్రంలో బిజెపి ఎంపీలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తదితరులు కేంద్రంతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన వాక్సిన్లు, మందులు, ఆక్సిజన్‌, వగైరాలు రప్పించగలిగితే ప్రజలు కూడా హర్షిస్తారు కదా?


Related Post