భారత్‌లో ఆ రెండు కంపెనీలే వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయగలవా?

May 06, 2021


img

ప్రపంచ దేశాలలో అత్యధికంగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్న దేశం భారత్‌. మరి కేవలం రెండు కంపెనీలు మాత్రమే కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయడం ఏమిటి?సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, భారత్‌ బయోటెక్ కంపెనీ దేశ అవసరాలకు సరిపడా వాక్సిన్లు అందజేయలేకపోతున్నప్పుడు ఆ వాక్సిన్లను దేశంలో డజన్ల కొద్దీ ఉన్న ఫార్మా, హెల్త్ కేర్ కంపెనీలలో కూడా తయారుచేయించవచ్చు కదా? కానీ కేంద్రప్రభుత్వం ఇంతవరకు ఎందుకు అటువంటి ప్రయత్నం చేయలేదు? దేశంలోనే వాక్సిన్లను ఉత్పత్తి చేసుకొనే అవకాశం ఉన్నా అలా చేయకుండా విదేశాల నుంచి వాక్సిన్లను దిగుమతి చేసుకోవడానికి మొగ్గుచూపుతోంది? అనే ప్రశ్నలకు కేంద్రప్రభుత్వమే సమాధానం చెప్పాలి. 

ఆ రెండు కంపెనీల వ్యాపార ప్రయోజనాల కంటే దేశంలోని 135 కోట్లకు పైగా ఉన్న ప్రజల ప్రాణాలే ముఖ్యమనుకొంటే కేంద్రప్రభుత్వం తక్షణం దేశంలో వివిద వాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు కోవీషీల్డ్, కోవాక్సిన్‌ ఫార్ములాను అందజేసి, అవసరమైన అన్ని అనుమతులను మంజూరు చేయడం మంచిది. 

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా అమెరికా సంస్థతో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సంస్థ రష్యా సంస్థతో ఒప్పందం చేసుకొని వాక్సిన్ ఉత్పత్తి చేయగలుగుతున్నప్పుడు, దేశంలోనే ఫార్మా కంపెనీల మద్య ఒప్పందాలు చేసుకొని వాక్సిన్లు ఉత్పత్తి చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అప్పుడే దేశ అవసరాలకు సరిపడా వాక్సిన్లు తయారవడమే కాకుండా మళ్ళీ ప్రపంచదేశాలకు కూడా భారత్‌ కరోనా వాక్సిన్లను అందించగలుగుతుంది. 

ఇప్పటికే చాలా ఆలశ్యమైపోయింది. దానికి లక్షలాది ప్రజలు భారీ మూల్యం చెల్లిస్తున్నారు కూడా. కనుక ఇకనైనా కేంద్రప్రభుత్వం తక్షణమే వీలైనన్ని కంపెనీల ద్వారా కోవీషీల్డ్, కోవాక్సిన్‌లు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడితే మంచిది.


Related Post