ఈటల సమస్య ప్రజల సమస్యా?

May 06, 2021


img

ఈటల రాజేందర్‌ ఇటీవల మంత్రివర్గం నుంచి తొలగించబడినప్పటి నుండి హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు,  ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, అనుచరులతో వరుసగా సమావేశమవుతున్నారు. బుదవారం హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పటివరకు నేను కలిసినవారందరూ నాకు చాలా అన్యాయం జరిగిందని చెపుతున్నారు. నాకు జరిగిన అన్యాయాన్ని వారందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. నాది, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడటానికి నేను ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా నాకు అండగా నిలబడతామని చెపుతున్నారు. కరీంనగర్‌ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అందరి అభిప్రాయాలు తీసుకొన్న తరువాత నా భవిష్యకార్యాచరణను ప్రకటిస్తాను,” అని చెప్పారు.    

ఈటల రాజేందర్‌ భూకబ్జాలకు పాల్పడ్డారా లేదా అనేది హైకోర్టు తెలుస్తుంది. కనుక ఆ విషయం పక్కన పెట్టి చూస్తే, టిఆర్ఎస్‌ అధిష్టానం ఆయనను చాలా అవమానకరంగా బయటకు సాగనంపిన మాట వాస్తవం. అందుకు ఆయన అహం, ఆత్మగౌరవం దెబ్బతినడం కూడా సహజమే. అయితే ఆయన తనపై వచ్చిన ఆరోపణలపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వకుండా, తన ఆత్మగౌరవం దెబ్బతిందని గట్టిగా వాదిస్తుండటం విచిత్రం. పైగా తన వ్యక్తిగత సమస్యను ప్రజల సమస్య అన్నట్లు మాట్లాడుతుండటం ఇంకా విడ్డూరంగా ఉంది. మంత్రిగా ఉన్నంతకాలం సిఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిపదంలో దూసుకుపోతోందని పొగిడిన ఈటల రాజేందర్‌, మంత్రి పదవిపోగానే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిందని దాని కోసం పోరాడుతానని చెపుతుండటం రాజకీయం చేయడమే అని చెప్పక తప్పదు. 

ఇంతకాలం ఆరోగ్యశాఖా మంత్రిగా ఉన్న ఈటలకు రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. కానీ ఈ పరిస్థితులలో ఆయన తనకు అన్యాయం జరిగిందంటూ రోజూ వందలాదిమందితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇది సరికాదనే చెప్పాలి. తనకు అన్యాయం జరిగిందని ఈటల భావిస్తున్నారు కనుక హైకోర్టులో పిటిషన్‌ వేసి మధ్యంతర ఉత్తర్వులు పొందారు. అదేవిదంగా టిఆర్ఎస్‌ అధిష్టానం తన ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బ తీస్తోందని భావిస్తే పరువునష్టం దావా వేయవచ్చు. ఒకవేళ ఆయన వాదనలలో నిజముంటే హైకోర్టు ఆయనకు న్యాయం చేస్తుంది. దాంతో మచ్చలేని నాయకుడిగా నిరూపితమవుతుంది. కానీ కరోనా మహమ్మారి సర్వత్రా వ్యాపించి ఉన్న ఈ పరిస్థితులలో ఆత్మగౌరవం పేరుతో రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలను పోగేసి ఆందోళనలు చేయాలనుకోవడం ఎవరూ సమర్ధించలేరు. ఆయన వ్యక్తిగత సమస్య కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెట్టాల్సిన అవసరం ఏమిటి?


Related Post