అమెరికాలో సాధ్యమైంది భారత్‌లో ఎందుకు కాదు?

May 05, 2021


img

మొదటిసారి కరోనా ప్రపంచాన్ని పలకరించినప్పుడు అమెరికా దానికి భారీ మూల్యం చెల్లించింది. అగ్రదేశమై ఉండి కూడా నిసహాయస్థితిలో దయనీయంగా మారింది. కారణాలు అందరికీ తెలిసినవే. కానీ మళ్ళీ మరోసారి కరోనా మహమ్మారి అమెరికాపై విరుచుకుపడినప్పుడు ఈసారి చాలా త్వరగా కొలుకొంది. భారత్‌ విషయంలో ఇందుకు పూర్తి విరుద్దంగా జరిగింది... జరుగుతోంది. మొదటిసారి భారత్‌ చాలా సమర్ధంగా కరోనాను కట్టడి చేసి ప్రపంచదేశాల చేత జేజేలు పలికించుకొంది. 

అప్పుడు అందరూ ప్రధాని నరేంద్రమోడీ సమర్ధ నాయకత్వం గురించి గట్టిగా…గొప్పగా చెప్పుకొన్నారు. బిజెపి నేతలైతే మరో అడుగు ముందుకు వేసి అగ్రరాజ్యం అమెరికాకు సాధ్యం కానీ పనిని ప్రధాని నరేంద్రమోడీ చేసి చూపారని భుజాలు చరుచుకొన్నారు. కానీ ఇప్పుడు దేశంలో కరోనాను అదుపుచేయలేక కేంద్రప్రభుత్వం చేతులెత్తేయడంతో అందరూ మోడీ అసమర్దత వలననే ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఒక్క ఏడాదిలో భారత్‌ పరిస్థితి తారుమారు ఎలా అయ్యింది? అంటే కారణాలు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఇటువంటి సమస్యలను అమెరికా కూడా ఎదుర్కొని బయటపడింది కానీ భారత్‌ అధిగమించలేకపోతోంది ఎందుకు? టీకాల ప్రక్రియను అత్యంత సమర్ధంగా నిర్వహించడం ద్వారా అమెరికా కరోనా నుంచి క్రమంగా విముక్తి పొందుతుంటే, భారత్‌ అక్కడే వైఫల్యం చెందడం వలననే అని చెప్పవచ్చు. 


దేశంలో ఓ పక్క కరోనా విలయతాండవం చేస్తుంటే శరవేగంగా సాగవలసిన టీకాల ప్రక్రియ నత్తనడకన సాగుతుండటం విశేషం. భారత్‌లో నేటికీ టీకాలు వేసే ప్రక్రియకు ఓ నిర్ధిష్టమైన విధానమంటూ ఏదీ లేకపోవడంతో అస్తవ్యస్తంగా సాగుతోంది. అసలు టీకాల గురించి ప్రజలకు ఖచ్చితమైన  సమాచారమే లభించడం లేదంటే భారత్‌లో ఈ కార్యక్రమం ఎంత గొప్పగా అమలవుతోందో అర్ధం చేసుకోవచ్చు. టీకాల కొరత ఎక్కువగా ఉండటంతో లక్షలాదిమంది రోజూ టీకా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. కరోనా సోకకుండా టీకా వేయించుకొందామని వెళితే అక్కడే కరోనా అంటుకొనే ప్రమాదం నెలకొంది. కనుక లోపం ఎక్కడుందో తెలిసి ఉన్నప్పుడు దానిని సరిదిద్దుకొంటే భారత్‌ కూడా ఈ సమస్య నుంచి బయటపడగలదు. కానీ దీనిని కూడా రాజకీయ, వ్యాపార దృక్పధంతోనే చూస్తూ కూర్చోంటే దేశం సగం ఖాళీ అయిపోవడం తధ్యం! 


Related Post