ఓడినా ఆమే ముఖ్యమంత్రి!

May 05, 2021


img

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్ ధన్‌కోడ్‌ రాజ్‌భవన్‌లో ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో మమతా బెనర్జీ వరుసగా మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కరోనా కారణంగా ప్రమాణస్వీకారం కార్యక్రమానికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. 

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ 292 స్థానాలలో 213 స్థానాలు గెలుచుకొని ఘనవిజయం సాధించింది. తన పార్టీని తిరుగులేని మెజార్టీతో గెలిపించుకొన్న మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ ఓడిపోవడం విశేషం. కనుక రాజ్యాంగ నిబందన ప్రకారం నేటి నుంచి ఆరు నెలల్లోగా ఆమె రాష్ట్రంలో ఏదో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తప్పక గెలవవలసి ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో శాసనమండలి లేదు కనుక తప్పనిసరిగా శాసనసభ స్థానానికే పోటీ చేసి గెలవవలసి ఉంటుంది. 

ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి బెంగాల్లో అధికారం చేజిక్కించుకొందామని విశ్వప్రయత్నం చేసిన బిజెపి మమతా బెనర్జీని ఓడించగలిగింది...కానీ అధికారం మాత్రం దక్కించుకోలేకపోయింది. అంటే మమతా బెనర్జీ ఓడి గెలిస్తే, బిజెపి గెలిచి ఓడిందనుకోవాలేమో? అయితే 2016 ఎన్నికలలో కేవలం 3 సీట్లు గెలుచుకొన్న బిజెపి ఈసారి ఎన్నికలలో 77 స్థానాలు గెలుచుకొని తన బలం పెంచుకోగలిగింది.

కొస మెరుపు ఏమిటంటే ఇన్నాళ్ళుగా ఓ కాలికి కట్టు వేసుకొని చక్రాల కుర్చీలో కూర్చొని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈరోజు ఆ కట్టు, కుర్చీ పక్కన పడేసి లేచి నిలబడి ప్రమాణస్వీకారం చేశారు.  


Related Post