భారత్‌లో ఆక్సిజన్‌ కొరత....దేనివలన?

May 05, 2021


img

దేశంలో కరోనాతో చనిపోతున్నవారు కొందరైతే ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతూ ఆక్సిజన్ అందక చనిపోతున్నవారు మరికొందరు. మొన్న ఢిల్లీలో...నిన్న బెంగళూరులో...నేడు చెన్నైలో ఆక్సిజన్ అందక చనిపోతూనే ఉన్నారు. చెంగల్‌పట్టు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న 11 మంది కరోనా రోగులు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో ఊపిరి ఆడక చనిపోయారు. 

భారత్‌లో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలియగానే ప్రపంచ దేశాలు భారీ ఎత్తున ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు, ఆక్సిజన్‌ సిలెండర్లు రోజూ పంపిస్తూనే ఉన్నాయి. ఇవికాక దేశవ్యాప్తంగా అనేక నగరాలలో గతంలో కంటే చాలా ఎక్కువగా నిత్యం ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా అవుతూనే ఉంది. అయినా ఆక్సిజన్ అందక రోగులు ఎందుకు మరణిస్తారు?అంటే రోజురోజుకీ ఆక్సిజన్ అవసరమున్న కరోనా రోగుల సంఖ్య పెరిగిపోవడమేనని చెప్పవచ్చు. కనుక కరోనా కట్టడి చేస్తే తప్ప ఇంకా ఎన్ని వేలు, లక్షల టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసినా, దిగుమతి చేసుకొన్నా సరిపోదు...ప్రయోజనం ఉండదని చెప్పవచ్చు. కానీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి గట్టిగా ప్రయత్నించకుండా ఆక్సిజన్‌ సరఫరాలు పెంచడంపైనే ఎక్కువ దృష్టి పెడుతుండటం విశేషం. ప్రస్తుత పరిస్థితులలో ఓ పక్క ఆక్సిజన్ సరఫరాలు పెంచుతూనే మరోపక్క దేశంలో కరోనా కట్టడికి మరింత గట్టి ప్రయత్నాలు చేయడం, వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం వంటి చర్యలు చేపట్టినప్పుడే ఈ సమస్యను అధిగమించవచ్చు లేకుంటే కరోనా మరణాలతో పాటు ఆక్సిజన్‌ మరణాలు కూడా కొనసాగుతూనే ఉంటాయి. 



Related Post