ఈటల దారి తప్పారా...వెతుక్కొంటున్నారా?

May 05, 2021


img

మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్న ఈటల రాజేందర్‌, భూకబ్జా ఆరోపణలతో అవినీతిపరుడిగా రోడ్డున పడ్డారు. ఇప్పుడు ఆయన, టిఆర్ఎస్‌ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకొంటున్నారు. ఇంతవరకు నీతి, నిజాయితీ, సౌమ్యతకు ప్రతిరూపంగా ఈటల రాజేందర్‌ రాష్ట్రంలో పలు చోట్ల భూకబ్జాలకు పాల్పడ్డారనే టిఆర్ఎస్‌ నేతల ఆరోపణలు విని ప్రజలు షాక్ అవుతున్నారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్ట ప్రకారం నేరమని తెలిసి ఉన్నప్పుడు మంత్రి హోదాలో ఉన్న ఈటల రాజేందర్‌ ఏవిదంగా కొన్నారని టిఆర్ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

అసైన్డ్ భూములు కొనడం నేరమని తెలిసి కొన్నానని చెప్పుకోవడానికి అర్ధం ఏమిటి?అధికారంలో ఉంటే ఏమి చేసినా చెల్లుతుంది...ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతోనే కదా?ఇప్పుడు ఇదే విషయంపై హైకోర్టుకు ఆయన ఏమి జవాబు చెపుతారు? ప్రజలకు ఏమని సమాధానం చెపుతారు? తనపై అవినీతి ఆరోపణలు వస్తున్నప్పుడు సిఎం కేసీఆర్‌ వ్యక్తిత్వం గురించి మాట్లాడటం ద్వారా ఈటల రాజేందర్‌ ఏమి సాధించాలనుకొంటున్నారు? తనకు అంటిన బురదను సిఎం కేసీఆర్‌కు కూడా అంటించి ప్రజల దృష్టి మళ్ళించాలనుకొంటున్నారా? పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను తీసుకొన్నానని ఒప్పుకొంటూనే మళ్ళీ నీతి, నిజయతీ, న్యాయం, ధర్మం, ఆత్మగౌరవం అని మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? వంటి అనేక ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈటల వాదనలు వింటున్నవారికి ఆయన తన నిజాయితీని నిరూపించుకొంటున్నట్లు కాక ఈ సమస్య నుంచి ఏదోవిదంగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ అవినీతి భాగోతమంతా రాబోయే రోజులలోనే రాజకీయ పరిణామంగా మారి ఓటుకు నోటు కేసు మాదిరిగానే మెల్లగా అటకెక్కిపోవచ్చు.


Related Post