ఈటల కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ

May 04, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, కుటుంబ సభ్యులు, వారి జమునా హాచరీస్ సంస్థ వేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. చట్ట ప్రకారం ముందుగా ఈటల రాజేందర్‌కు నోటీస్ ఇవ్వకుండా ఆయన అధీనంలో ఉన్న భూములలో సర్వే చేయడాన్ని తప్పు పట్టింది. అలాగే మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ హడావుడిగా నివేదిక సమర్పించడాన్ని కూడా హైకోర్టు తప్పు పట్టింది. 

చట్ట ప్రకారం ఈటలకు ముందుగా నోటీసులు ఇచ్చి తగినంత సమయం ఇచ్చి ఆయన స్పందించకుంటే అప్పుడు అధికారులు చట్ట ప్రకారం వ్యవహరించవచ్చు కానీ ఈవిదంగా చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఈ కేసుపై విచారణ పూర్తయ్యేవరకు జమునా హాచరీస్ భూములు, వ్యాపారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈటల రాజేందర్‌కు తాత్కాలిక ఉపశమనం లభించినట్లయింది. ఇటువంటి వ్యవహారాలలో ప్రభుత్వం, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఏమవుతుందో కూడా స్పష్టమైంది. 

 ఈటల రాజేందర్‌ తరపున సీనియర్ న్యాయవాది  దేశాయి ప్రకాష్ రెడ్డి ఈ కేసును వాదించగా ప్రభుత్వం తరపున ఏజీ ప్రసాద్ వాదించారు. ఈ కేసు తదుపరి విచారణను జూలై 6కు హైకోర్టు వాయిదా వేసింది. అంటే మరో రెండు నెలలన్నమాట! ఆలోగానే ఈ వేడి చల్లారిపోయినా ఆశ్చర్యం లేదు.


Related Post