ఇదంతా ఈటలను ఏకాకిగా చేయడానికేనా?

May 04, 2021


img

తెలంగాణ ప్రభుత్వంలో... టిఆర్ఎస్‌లో ఎవరైనా కాస్త అసమ్మతి స్వరం వినిపించే నాయకుడు ఉన్నారంటే అది ఈటల రాజేందర్‌ ఒక్కరే అని అందరికీ తెలుసు. ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ సిఎం కేసీఆర్‌కు విధేయంగా ఉండేవారు. మరి తనపై సిఎం కేసీఆర్‌ ఇంత కక్ష కట్టినట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్‌ అడిగిన ప్రశ్నకు భూకబ్జాలకు పాల్పడటం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆ కారణంతో చర్యలు తీసుకొదలిస్తే టిఆర్ఎస్‌... ప్రభుత్వంలో చాలామందే ఉన్నారని ఈటలే చెప్పారు. మరెందుకు ఈటల పట్ల ఇంత కటినంగా వ్యవహరిస్తున్నారు? అనే సందేహం అందరికీ ఉంది. దీనికి బలమైన కారణమే కనిపిస్తోంది.

కొంతకాలం క్రితం మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలో నేతలు అందరూ త్వరలో కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ కోరస్ పాడటం అందరికీ తెలుసు. ఆ సమయంలో ఈటల రాజేందర్‌ వారితో పెద్దగా గొంతుకలుపలేదు. ఏదో మొక్కుబడిగా సమర్ధించారు అంతే! కానీ అదే సమయంలో కాంగ్రెస్‌, బిజెపిలు కేటీఆర్‌ కంటే ఈటల రాజేందర్‌ చాలా సమర్దుడు, అనుభవశాలి, పరిపాలనాదక్షుడు, మృదుస్వభావి, ప్రతిపక్షాలను కూడా కలుపుకుపోగలవాడని గట్టిగా సమర్ధించాయి...కనుక ఒకవేళ కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోదలిస్తే ఆ పదవిని ఈటల రాజేందర్‌కు ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశాయి. 

ప్రతిపక్షాలు ఈటల రాజేందర్‌ను అంతగా వెనకేసుకురావడం టిఆర్ఎస్‌ అధిష్టానం జీర్ణించుకోవడం కష్టమే. బహుశః అందుకే ఈటల రాజేందర్‌ను బయటకు పంపాలని టిఆర్ఎస్‌ అధిష్టానం నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. రాష్ట్రంలో అన్ని ఎన్నికలు పూర్తయిపోయాయి కనుక ఇప్పుడు ఈటల రాజేందర్‌ కధకు ఈవిదంగా ముగింపు పలికి ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

అయితే ఈటల వంటి బలమైన నేతను బయటకు పంపిస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. ఆయన కాంగ్రెస్‌, బిజెపి, టిజేఎస్‌ పార్టీలలో ఏదో ఓ దానిలో చేరవచ్చు. ఆయనకు జరిగిన అవమానాలను చూస్తున్నవారు రేపు ఏదో రోజూ తమకీ ఇటువంటి దుస్థితి ఎదురవుతుందని భావించి ఆయన వెనక బయటకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంది. కనుక ఆయన ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ బలపడుతుంది. బహుశః ఆయనకు అటువంటి అవకాశం కూడా లేకుండా చేసేందుకే అవినీతిముద్ర వేసి ఏకాకిని చేస్తున్నట్లు భావించవచ్చు. ఆయన నిజంగానే భూకబ్జాలు చేశారా లేదా?అనేది న్యాయస్థానాలు తెలుస్తాయి. కానీ ఆలోగా ఈటల రాజేందర్‌ను ఏ పార్టీ ఆహ్వానించకుండా, ఆయన ఏ పార్టీలో చేరలేని పరిస్థితి కల్పించేందుకే ఈ అవినీతిముద్రలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Related Post