కాంగ్రెస్‌ కధ ముగిసినట్లేనా?

May 04, 2021


img

అటు జాతీయ స్థాయిలో, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఘోరపరాజయం పాలైంది. తమిళనాడులో విజయావకాశాలున్న డీఎంకె పార్టీని అంటిపెట్టుకొని ఉండటం వలన, ఆ పార్టీ ప్రభావంతో 18 సీట్లు గెలుచుకోగలిగింది. కేరళలో ఆనవాయితీ ప్రకారం ఈసారి కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి రావాలసి ఉండగా మళ్ళీ లెఫ్ట్ కూటమి అధికారం చేజిక్కించుకొంది. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఎన్ని బస్కీలు తీసినా ప్రయోజనం లేకుండాపోయింది.

పుదుచ్చేరిలో కూడా గెలవలేక చతికిలపడింది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ధాటికి కాంగ్రెస్‌ అడ్రస్ లేకుండా పోయింది. అస్సాంలో మళ్ళీ బిజెపియే అధికారంలోకి వచ్చింది. 

ఇక సాగర్ ఉపఎన్నికలో సీనియర్ నేత కె.జానారెడ్డిని బరిలోకి దించినా ఫలితం లేకుండా పోయింది. మున్సిపల్ ఎన్నికలలోను కాంగ్రెస్‌ ఘోరపరాజయం పాలైంది. 

వరుసగా ప్రతీ ఎన్నికలలో ఓడిపోతుండటం ఒక సమస్య అయితే, నాయకత్వ సమస్య కూడా కాంగ్రెస్‌ పార్టీని వెంటాడుతోంది. ఇది స్వయంకృతాపరాధమే అని చెప్పక తప్పదు.   

ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీ కాంగ్రెస్‌ పార్టీని ఇదివరకులా నడిపించలేకపోతున్నారు. కానీ ఆమె స్థానంలో రాహుల్ గాంధీ తప్ప వేరెవరూ పార్టీ పగ్గాలు చేపట్టరాదనే అప్రకటిత నిబందన కారణంగా జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది.    

తెలంగాణ పిసిసి అధ్యక్షుడి నియామకం తేనెతుట్టెను కదపడమే అవుతోంది. దాంతో ఆ ఆలోచనే విరమించుకొని ఉత్తమ్‌కుమార్ రెడ్డితోనే లాగించేస్తోంది. పార్టీలో నేతలు ఆ పదవి మీద మోజుతోనే పోటీ పడుతున్నారు తప్ప ఇప్పుడు ఎవరు పార్టీ పగ్గాలు చేపట్టినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాపాడటం చాలా కష్టమేనని వారికీ తెలుసు. ఇక పొరుగు రాష్ట్రం ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అన్నట్లుంది.

కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న ఈ పరిస్థితులను, దాని పతనాన్ని చూస్తుంటే అది మళ్ళీ ఎప్పటికైనా కోలుకోగలదా లేదా అనే సందేహం కలుగక మానదు. అయినప్పటికీ రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్‌ నేతలెవరికీ ఆ సందేహం, భయం ఉన్నట్లు కనబడదు. నానాటికీ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతున్నా…ఎన్నిసార్లు ఓడిపోతున్నా ఎవరి వైఖరిలో ఎటువంటి మార్పు కనబడటం లేదు. మునిగిపోతున్న కాంగ్రెస్‌ టైటానిక్ షిప్పును తామే నడిపించాలని అందరూ తపిస్తున్నారే తప్ప మునిగిపోకుండా కాపాడుకొనే ప్రయత్నాలు...కనీసం ఆ ఆలోచన కూడా చేస్తున్నట్లు లేదు. కనుక ఇక కాంగ్రెస్ పార్టీని ఆ దేవుడే రక్షించాలేమో?


Related Post