సిఎం కేసీఆర్‌పై ఈటల తీవ్ర విమర్శలు

May 03, 2021


img

మంత్రివర్గంలో నుంచి ఈటల రాజేందర్‌ను తొలగించడంతో ఆయన ఈరోజు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

“నన్ను యావత్ తెలంగాణ సమాజం అసహ్యించుకొనేవిదంగా నాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. నాపై ఓ పధకం ప్రకారమే ఈ కుట్ర జరిగింది. తమ్ముడూ...అని పిలిచిన సిఎం కేసీఆర్‌ కనీసం నా వివరణ తీసుకోకుండా, నోటీసులు పంపించకుండా ఆఘమేఘాలపై నా భూములపై విచారణకు ఆదేశించడం, వెనువెంటనే పదవి నుంచి తొలగించడం నాకు చాలా బాధ కలిగించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన అధికారాన్ని పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు నావంటి సామాన్యుడిపై ప్రయోగించడం సరికాదు. సిఎం కేసీఆర్‌ పార్టీ పెట్టినప్పటి నుంచి నేను ఎన్నడూ క్రమశిక్షణ ఉల్లంఘించలేదు.. అవినీతికి పాల్పడలేదు. కానీ ఇప్పుడు నాకు సంబందం లేని భూములను కూడా కలిపి వాటిని నేను కబ్జా చేశానని ఆరోపిస్తూ నా స్వాభిమానాన్ని, పరువు ప్రతిష్టలను దెబ్బ తీస్తుండటంతో చాలా బాధాకరం. అసైన్డ్ భూములు కొనడం నేరమే. కానీ ముఖ్యమంత్రి ఫాంహౌసు కోసం అసైన్డ్ భూములు తీసుకొనే వేశారు కదా?

ముఖ్యమంత్రి ఏదనుకొంటే అది జరుగుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది అందరూ ఆయన కోరినవిదంగానే నివేదికలు తయారుచేస్తారు తప్ప వేరే విదంగా ఇవ్వరు కదా? వాటికి నేను భయపడను. ఒకవేళ ప్రభుత్వం చెపుతున్నట్లుగా నేను భూఆక్రమణలకు పాల్పడి ఉంటే చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి, విచారణ జరిపి నాపై కేసు నమోదు చేయమనండి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపినా నేను సిద్దం అని మొదటి నుంచి చెపుతూనే ఉన్నాను. ఒకవేళ నేను దోషినని తేలితే జైలుకు వెళ్ళేందుకు కూడా సిద్దమే. కానీ నాకు సంబందం లేని భూములను నాకు అంటగట్టి అవినీతి ఆరోపణలు చేస్తే సహించేది లేదు. నాకు నా ఆత్మగౌరవం కంటే ఏదీ ఎక్కువ కాదు. అవసరమైతే నేనే కోర్టుకు వెళతాను. నేను నా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్దం. నా నియోజకవర్గం ప్రజలతో, నా అనుచరులతో చర్చించిన తరువాత నా భవిష్య కార్యాచరణ ప్రకటిస్తాను,” అని ఆయన మాటల సారాంశం.


Related Post