పాపం...కమల్ హాసన్‌!

May 03, 2021


img

ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌కు తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ఘోరపరాభవం ఎదురైంది. ఆయనతో సహా పార్టీలో ఒక్కరూ కూడా ఎన్నికలలో గెలవలేకపోయారు. తమిళనాడులో జయలలిత, కరుణానిధిల మరణంతో ఏర్పడిన రాజకీయశూన్యతను వినియోగించుకొని రాష్ట్ర రాజకీయాలలో ఎదగాలని కలలుగన్న కమల్ హాసన్‌ మక్కల్ నీది మయ్యుమ్ పార్టీతో మార్చి 2018లో రాజకీయ ప్రవేశం చేసారు. అప్పటి నుంచి ప్రజల మద్యనే ఉంటూ వారిని ఆకట్టుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పార్టీని కూడా బాగానే బలోపేతం చేసుకోగలిగారు. ఈసారి శాసనసభ ఎన్నికలలో తప్పకుండా గెలిచి అధికారంలోకి రావాలని చాలా పట్టుదలగా ప్రయత్నించారు. గెలిచి అధికారంలోకి రాలేకపోయినా కనీసం గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకొని శాసనసభలో అడుగుపెట్టలేకపోయారు. తమిళనాడు ప్రజలు ఎప్పటిలాగే అన్నాడీఎంకె, డీఎంకె పార్టీలవైపే మొగ్గు చూపారు. 

అధికార అన్నాడీఎంకె పార్టీ ఈ ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ అనూహ్యంగా 75 సీట్లు గెలుచుకొని బలంగా నిలబడింది. తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులను తెలివిగా ఉపయోగించుకొంటూ అన్నాడీఎంకె పార్టీతో కలిసి రాష్ట్రంలో అడుగుపెట్టాలని కలలుగన్న బిజెపి కల కూడా నెరవేరింది. తొలిసారిగా ఈ ఎన్నికలలో బిజెపి 4 సీట్లు గెలుచుకోగలిగింది.    

పదేళ్ళుగా అధికారానికి దూరమైన డీఎంకె పార్టీ 159 సీట్లు గెలుచుకొని అధికారం కైవసం చేసుకొంది. ప్రతీ ఎన్నికలలో ఎదురుదెబ్బలు తింటున్న కాంగ్రెస్ పార్టీ, ఈ ఎన్నికలలో కూడా పుదుచ్చేరి, మూడు రాష్ట్రాలలో ఘోరపరాజయం పాలైనప్పటికీ, తమిళనాడులో డీఎంకె పార్టీని అంటిపెట్టుకొని ఉన్నందునే 18 సీట్లు గెలుచుకోగలిగిందని చెప్పవచ్చు. 

తమిళనాడు రాజకీయాలను శాసించాలని కలలుగన్న శశికళ, ఎన్నికలకు ముందు (బహుశః బిజెపి ఒత్తిడితో) హటాత్తుగా రాజకీయ సన్యాసం చేయడంతో తీవ్ర నిరాశ చెందిన ఆమె మేనల్లుడు దినకరన్ (ఏఎంఎంకె పార్టీ అధ్యక్షుడు)కి ఎన్నికలలో కూడా నిరాశ తప్పలేదు. ఈ ఎన్నికలలో ఆయనతో సహా పార్టీలో ఏ ఒక్కరూ గెలవలేకపోయారు. అంతిమంగా తేలింది ఏమిటంటే...తమిళనాడు ప్రజలు అన్నాడీఎంకె, డీఎంకె పార్టీలను తప్ప వేరే ఏ పార్టీకి అధికారం కట్టబెట్టరని!


Related Post