మంత్రివర్గం నుంచి ఈటలకు ఉద్వాసన..వాట్ నెక్స్ట్?

May 03, 2021


img

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు నిజమని తేలడంతో ఆదివారం సాయంత్రం సిఎం కేసీఆర్‌ ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా ఆమోదముద్ర వేయడంతో ఈటల రాజేందర్‌ ఇప్పుడు కేవలం ఓ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. 

తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఎవరికీ ఆచ్చిరావడం లేదు. మొదట ఆ పదవిని చేపట్టిన రాజయ్యపై  ఇలాగే అవినీతి ఆరోపణలు రావడంతో సిఎం కేసీఆర్‌ ఆయనను ఆ పదవిలో నుంచి తొలగించారు. ఇప్పుడు ఈటల రాజేందర్‌ కూడా అవినీతి ఆరోపణలతోనే పదవిలో నుంచి తొలగించబడ్డారు. ఇద్దరూ వెనుకబడిన వర్గాలకు చెందినవారే కావడం మరో విశేషం. 

అయితే అప్పుడు రాజయ్య పదవిలో నుంచి అవమానకరంగా తొలగించబడినప్పటికీ కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా సంయమనం పాటించడంతో 2018 శాసనసభ ఎన్నికలలో మళ్ళీ ఆయనకు సిఎం కేసీఆర్‌ పార్టీ టికెట్ ఇచ్చారు. కానీ తనను ఇంత అవమానకరంగా బయటకు పంపించడాన్ని ఈటల రాజేందర్‌ జీర్ణించుకోవడం కష్టమే. పదవులు, అధికారం కంటే ఆత్మాభిమానమే ముఖ్యమని  భావించే ఈటల రాజేందర్‌ ఇంత అవమానం జరిగిన తరువాత టిఆర్ఎస్‌లో కొనసాగుతారనుకోలేము. కనుక ఆయన సిఎం కేసీఆర్‌పై...టిఆర్ఎస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించడం ఖాయం. ఇది నేడే జరుగుతుందా మరికొన్ని రోజుల తరువాత జరుగుతుందా అనేదే తేలాలి.


Related Post