పశ్చిమ బెంగాల్‌ మళ్ళీ దీదీదే

May 02, 2021


img

పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలలో అంచనాలను తారుమారు చేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టిఎంసీ)ఘనవిజయం సాధించబోతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం మొత్తం 282 స్థానాలలో టిఎంసీ 167 సీట్లు గెలుచుకొని మరో 50 స్థానాలలో ఆదిఖ్యతలో ఉంది. అంటే సుమారు 217 సీట్లు గెలుచుకొని తిరుగులేని మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఎన్నికలలో గెలిచి ఈసారి బెంగాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బిజెపి విశ్వప్రయత్నాలు చేసింది. టిఎంసీని అనేకవిధాలుగా ఇబ్బందులకు గురి చేసింది. సాక్షాత్ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలు పశ్చిమ బెంగాల్‌లో పర్యటించి గెలుపుకోసం ఎన్నికల ప్రచారం చేశారు. కానీ వారి ప్రయత్నాలు, ఒత్తిళ్ళు ఏవీ పనిచేయలేదు. ఎగ్జిట్ పోల్స్‌లో కొన్ని మీడియా సంస్థలు టిఎంసీకి బొటాబోటి సీట్లతో అధికారం చేజిక్కించుకొంటుందని జోస్యం చెప్పాయి. కానీ వాటి అంచనాలను తలక్రిందులు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్‌ భారీ మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి రాబోతోంది. ఇది ఖచ్చితంగా బెంగాల్ లేడీ టైగర్ మమతా బెనర్జీ  గెలుపే. అలాగే ఇది ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాల ఓటమే అని చెప్పక తప్పదు.


Related Post