నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ కుమార్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్ధి, సీనియర్ కాంగ్రెస్ నేత కె.జానారెడ్డిపై 15,487 ఓట్లు అధిక్యతతో విజయం సాధించారు. ఈ ఉపఎన్నికల ఫలితాలలో టిఆర్ఎస్‌కు మొత్తం 74,726, కాంగ్రెస్‌కు 59,239, బిజెపికి కేవలం 6,365 ఓట్లు పోలయ్యాయి. దీంతో బిజెపి డిపాజిట్ కోల్పోయింది.
కె.జానారెడ్డి చివరి వరకు టిఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ కుమార్‌కు గట్టి పోటీ ఇవ్వగలిగారు కానీ ఏ రౌండ్‌లోను ఆదిఖ్యత కనబరచలేకపోయారు. అయితే కె.జానారెడ్డి గాబట్టే కనీసం అన్ని ఓట్లు సాధించారని చెప్పక తప్పదు. అదే.. ఆయన స్థానంలో మరొకరు పోటీ చేసి ఉండి ఉంటే టిఆర్ఎస్, బిజెపిలకు మరిన్ని ఓట్లు పడేవి.
రాష్ట్రంలో ఆరిపోతున్న కాంగ్రెస్ దీపాన్ని మళ్ళీ వెలిగించేందుకు కె.జానారెడ్డి అయిష్టంగానే బరిలోకి దిగి కరోనా మహమ్మారికి కూడా భయపడకుండా సర్వశక్తులు ఒడ్డి పోరాడారు కానీ ఎనిమిదిసార్లు గెలిచి తనకంటూ ఓ రికార్డు సృష్టించుకొన్న కె.జానారెడ్డి చివరికి మొదటిసారిగా పోటీ చేసిన నోముల భగత్ కుమార్ చేతిలో ఓడిపోయి చేజేతులా తన ప్రతిష్టను మంటగలుపుకొన్నారని చెప్పక తప్పదు.
ఇక దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో గెలుపుతో అత్యుత్సాహం ప్రదర్శించిన బిజెపి ఈ ఉపఎన్నికలో డిపాజిట్ కోల్పోవడం చాలా అవమానకరమే. ఆ రెండు ఓటములకు టిఆర్ఎస్ ఈ ఉపఎన్నికలో బిజెపికి డిపాజిట్ దక్కకుండా చేసి ప్రతీకారం తీర్చుకొన్నట్లయింది.