మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలపై సిఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడం, ఆ నివేదిక వచ్చేలోపుగానే ఆయన మంత్రి పదవి నుంచి తొలగించడంపై కాంగ్రెస్, బిజెపిలు ఇంకా స్పందించలేదు కానీ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాత్రం వెంటనే స్పందించారు.
హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్ చిత్తశుద్దితో పనిచేసే ఉద్యమకారులను, తనను ప్రశ్నించే ఈటల రాజేందర్ వంటివారిని ఈవిదంగా కేసులతో అణగద్రొక్కేస్తున్నారు. ఉద్యమకారులు అందరూ వేర్వేరుగా ఉండిపోవడం వలననే సిఎం కేసీఆర్ రెచ్చిపోతున్నారు. కనుక కేసీఆర్‌ను గద్దె దించడానికి ఉద్యమకారులందరూ ఏకం కావలసిన సమయం ఇదే. కేసీఆర్ నిరంకుశపాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉద్యమకారులందరూ ఏకం కావాలి. ఒక్క ఈటల రాజేందర్‌పైనే కాదు కేటీఆర్, మల్లారెడ్డి, ముత్తిరెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిల అక్రమాలు, అవినీతిపై కూడా విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాను. భూరికార్డుల ప్రక్షాళనలో అనేక అవకతవకలు జరిగాయనే మా వాదనలు నిజమని ఇప్పుడు స్పష్టమైంది కనుక తక్షణమే హఫీజ్ పేట్, మియాపూర్ భూవివాదాలపై కూడా సిఎం కేసీఆర్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాను,” అని అన్నారు.