సిఎం కేసీఆర్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఈరోజు వరుసగా పెద్ద పెద్ద షాకులు ఇచ్చారు. మొదట ఆయన భూకబ్జాలపై విచారణకు ఆదేశించిన సిఎం కేసీఆర్, వాటిలో ఆయన ప్రమేయం ఉందని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ అక్కడ అచ్చంపేటలో మీడియాకు చెప్పగానే, ఇక్కడ హైదరాబాద్‌లో ఈటల మంత్రి పదవి వెనక్కుతీసుకొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖను సిఎం కేసీఆర్‌కు అప్పజెపుతూ జారీ చేసిన ఆదేశాలపై వెంటనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతకం చేసి ఆమోదముద్ర వేయడంతో ఈటల మంత్రి పదవి ఊడిపోయింది.
అయితే దీనిపై ఈటల రాజేందర్ చాలా ఆచితూచి స్పందించడం విశేషం. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రికి ఏ శాఖనైనా వెనక్కు తీసుకొనే అధికారం ఉంటుంది. ఎప్పుడైనా ఏ మంత్రినైనా పదవిలో నుంచి తొలగించే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖను మరింత సమర్ధంగా నిర్వహించేందుకే వెనక్కు తీసుకొన్నట్లు భావిస్తున్నాను. నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని నేనే స్వయంగా కోరాను కనుక పూర్తి నివేదిక వచ్చేవరకు ఆగుతాను. ఈలోగా నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో, నా అనుచరులతో నాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పరిణామాల గురించి చర్చిస్తాను. ఆ తరువాతే నేను మాట్లాడుతాను,” అని అన్నారు ఈటల రాజేందర్.
దీనికంతటికి కారణం ఆయన తరచూ ప్రభుత్వం పట్ల అసంతృప్తి, అసహనం వ్యక్తం చేయడమే అయ్యుండవచ్చు. ఎందుకంటే టిఆర్ఎస్‌లో కొంతమంది నేతలపై కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ వారెవరిపై సిఎం కేసీఆర్ ఇటువంటి చర్యలు తీసుకోలేదని ఈటల రాజేందర్ స్వయంగా ఈరోజు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో అందరికంటే సీనియర్ అయిన ఈటల రాజేందర్‌కు ఇది చాలా అవమానకరం ముగింపే అని చెప్పకతప్పదు.