భారత్‌లో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గత 24 గంటలలో దేశంలో 4,01, 993 మందికి కరోనా సోకింది. ఒకేరోజున 3,523 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా 32,68, 710 యాక్టివ్ కేసులున్నాయి. తాజా లెక్కల ప్రకారం దేశంలో ఇప్పటివరకు 1.91 కోట్ల మంది కరోనా బారినపడగా వారిలో 1.56 కోట్ల మంది కోలుకొన్నారు. అయితే ఇవన్నీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చెపుతున్న అధికారిక లెక్కలు మాత్రమే. వాటి లెక్కలలోకి రాని కేసులు, మరణాలు చాలానే ఉంటాయని అందరికీ తెలుసు.
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రులలో వేలాది బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, వైద్యులు, వైద్య సిబ్బంది, మందులు, వ్యాక్సిన్లు అన్నీ ఉన్నాయని దేనికి కొరత లేదని చెపుతుంటే వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒకవేళ కరోనాతో ఆసుపత్రిలో చేరాల్సివస్తే రాజకీయనేతలతో రికమండేషన్ చేయించుకోవాలి... లక్షల రూపాయలు ఫీజులు చెల్లించాలి. అయినా ప్రాణాలతో తిరిగి వస్తామనే గ్యారెంటీ లేదు. కరోనాతో పోవచ్చు లేదా ఆసుపత్రిలో అర్దరాత్రి జరిగే అగ్నిప్రమాదంలో చనిపోవచ్చు.
ఒకవేళ కరోనాతో చనిపోతే అంత్యక్రియలు చేయలేని దుస్థితి నెలకొంది. అంత్యక్రియలకు వేలాది రూపాయలు గుంజుతున్న ముఠాలు. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో సహా ఎవరూ వెళ్లలేని దుస్థితి. శ్మశానాల వద్ద శవాలను పెట్టుకొని క్యూలో గంటల కొద్దీ ఎదురుచూపులు.
వ్యాక్సిన్ల కోసం వెళితే వాక్సిన్ కేంద్రాలలో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తాయి లేదా ప్రతీచోట వందలమంది ఎదురుచూస్తుంటారు. ఒకవేళ వాక్సిన్లు ఉంటే ‘రోజుకు 50 మందికి మాత్రమే లేదా 200 మందికి మాత్రమే వాక్సిన్ ఇవ్వబడును... లేదా సెకండ్ డోస్ మాత్రమే వేయబడును...’ అంటూ బోర్డులు కనిపిస్తాయి. వాక్సిన్ వేసుకొన్నా కరోనా సోకదనే గ్యారెంటీ ఏమీ లేదు.
ఇక కరోనా చికిత్సలో అత్యంత కీలకంగా భావిస్తున్న రెమిడీసీవిర్ బ్లాక్ మార్కెట్లో తప్ప ఆసుపత్రులలో లభించదు. బ్లాక్ మార్కెట్లో ఒక్కో ఇంజక్షన్ ధర రూ.25-30,000 వరకు వసూలు చేస్తున్నట్లు రోజూ వార్తలు వింటూనే ఉన్నాము. ఇటీవల నిజామాబాద్‌లో ఇద్దరు వ్యక్తులు ఇంజక్షన్ బాటిల్స్ లో సెలైన్ వాటర్ నింపి వాటినే రెమిడీసీవిర్ ఇంజక్షన్లుగా విక్రయిస్తూ పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి.
దేశంలో నెలకొన్న ఈ పరిస్థితులు చూస్తుంటే భారత్‌లో కరోనా వైరస్ అదుపు తప్పడమే కాదు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా చేతులెత్తేసినట్లు స్పష్టం అవుతోంది. ఇటువంటి దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలకు కూడా క్రమంగా ప్రభుత్వాలపై నమ్మకం కోల్పోతున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్నాయి కనుక ఇక ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటూ ప్రాణాలను కాపాడుకోవాలి. ఎప్పటికైనా ఈ కరోనా మహమ్మారి అంతరించి అప్పటికీ ఇంకా ప్రజలు బ్రతికి ఉన్నారంటే అది తమ గొప్పతనమే అని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోక మానవు.