రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉద్వాసనకు రంగం సిద్దమవుతోందా?అంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి అధికారిక పత్రికగా చెప్పుకోబడే ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఈరోజు ఎడిషన్‌లో ‘బడుగుల భూమిలో ఈటల పాగా’ అనే హెడ్డింగుతో మంత్రి ఈటల రాజేందర్ ఏవిదంగా భూకబ్జాలకు పాల్పడ్డారో వివరిస్తూ ఓ కధనం ప్రచురించింది.
అధికార పార్టీకి, నేతలు, మంత్రులకు, ప్రభుత్వానికి అనుకూలవార్తలు మాత్రమే ప్రచురించి, ప్రసారం చేసే ‘నమస్తే తెలంగాణ’ మీడియాలో టిఆర్ఎస్ పార్టీలో...తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్ నేత, సీనియర్ మంత్రి అయిన ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా వ్రాయడం, కొన్ని గంటల వ్యవధిలోనే సిఎం కేసీఆర్ ఈటల భూకబ్జాలపై విచారణకు ఆదేశించడం, వెంటనే ఏసీబీ అధికారులు అచ్చంపేట చేరుకొని విచారణ చేపట్టడం, అదే సమయంలో తుఫ్రాన్ ఆర్డీఓ రాంప్రకాష్ అధ్వర్యంలో రెవెన్యూ అధికారులు అచ్చంపేటలో ఈటల రాజేందర్ స్వాధీనంలో ఉన్న భూములను సర్వే చేస్తుండటం వంటివన్నీ ఆయనను బయటకు సాగనంపడానికి జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగానే భావించవచ్చు.
అక్కడ జరుగుతున్న ఈ హడావుడితో ఈటల రాజేందర్ అభిమానులు, అనుచరులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొంటున్నారు. దీంతో అచ్చంపేటలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎటువంటి ఆవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.
ఏది ఏమైనప్పటికీ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రభుత్వం నుంచి త్వరలోనే ఉద్వాసన తప్పదని స్పష్టమవుతోంది. ఈ పరిణామాలతో తన పరువు ప్రతిష్టలకు భంగం కలగడమే కాక మచ్చలేని తన రాజకీయ జీవితంపై ఉద్దేశ్యపూర్వకంగా బురద జల్లుతున్నారని భావిస్తున్న మంత్రి ఈటల రాజేందర్ సిఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కనుక ఆయన కూడా టిఆర్ఎస్ నేతలపై, సిఎం కేసీఆర్‌పై యుద్ధ ప్రకటన చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఫోటోలు: నమస్తే తెలంగాణ సౌజన్యంతో..