తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ సరికొత్త ప్రయోగం చేపట్టబోతోంది. అదే...డ్రోన్ల ద్వారా ప్రతీ ఇంటికీ వ్యాక్సిన్ పంపిణీ చేయడం. ఈ ప్రతిపాదనకు డీజీసీఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)అనుమతినిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ఏడాదిపాటు అనుమతి మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.
డ్రోన్ల ద్వారా ఇంటింటికీ టీకాలు అందించాలనే ఆలోచన అద్భుతంగా ఉంది. డ్రోన్ల ద్వారా వాక్సిన్లు నగరాలు, పట్టణాలలో అన్ని ప్రాంతాలకు, రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా సులువుగా త్వరగా చేరవేయవచ్చు. అందరికీ డ్రోన్ల ద్వారా వేగంగా వాక్సిన్లు పంపిణీ చేయగలిగితే కరోనాకు అడ్డుకట్టపడుతుంది. అయితే అంతకంటే ముందుగా రాష్ట్రానికి సరిపడినన్ని వాక్సిన్లను కేంద్రప్రభుత్వం అందజేయాల్సి ఉంటుంది. తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలలో ఇప్పటికే వాక్సిన్లకు తీవ్ర కొరత నెలకొని ఉంది. వాక్సిన్ కేంద్రాల వద్దకు వస్తున్నవారందరికీ టీకాలు వేయలేని దుస్థితి నెలకొని ఉంది. రేపటి నుండి 18 ఏళ్ళకు పైబడినవారు కూడా కరోనా టీకాలు వేయించుకోవడానికి వస్తే ఆ కొరత ఇంకా పెరుగుతుంది.
ఇక డ్రోన్ల ద్వారా వాక్సిన్ సరఫరాకు ఓ ప్రత్యేక వ్యవస్థ, వాటిని ఎక్కడికక్కడ అందుకొని సక్రమంగా, పారదర్శకంగా వేగంగా టీకాలు వేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. అన్నీ సజావుగా సాగితే దీంతో ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు.