భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తున్నవేళ పుదుచ్చేరి, నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు నిర్వహించడంపై అంతర్జాతీయ మీడియా కూడా విమర్శలు గుప్పిస్తోంది. తమిళనాడులో కరోనా విజృంభణకు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలని, నిజానికి సామాజిక బాధ్యతను మరిచి ఎన్నికలు నిర్వహించి పలువురు మృతికి కారణమైన రాష్ట్ర ఎన్నికల సంఘంపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి.
మద్రాస్ హైకోర్టు ఆఫ్ ద రికార్డుగా చేసిన ఆ తీవ్ర వ్యాఖ్యలను మీడియాలో ప్రముఖంగా ప్రచురిస్తుండటంతో తమ ప్రతిష్టకు భంగం కలుగుతోందని కనుక మీడియా ఆ వ్యాఖ్యలను, వాటికి సంబందించి వార్తలను ప్రచురించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తమిళనాడు ఎన్నికల సంఘం మళ్ళీ మద్రాస్ హైకోర్టులోనే నేడు ఓ పిటిషన్ వేయడం విశేషం.
తాము రాజ్యాంగబద్దంగా, పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని, అది తమ బాధ్యత కూడా అని తమిళనాడు ఎన్నికల సంఘం పిటిషన్‌లో పేర్కొంది. తమ బాధ్యతను సక్రమంగా, సమర్ధంగా నిర్వర్తించినందుకు ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ ఈవిదంగా తమ ప్రతిష్టకు భంగం కలిగించడం సమంజసం కాదని వాపోయింది. ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు మీడియాలో ప్రచురితమవుతుండటంతో ఇతర రాష్ట్రాలలో ఎన్నికల సంఘాలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోందని, కనుక హైకోర్టు వ్యాఖ్యలను మీడియాలో ప్రచురించకుండా ఆదేశాలు జారీచేయాలని పిటిషన్ ద్వారా కోరింది. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆదేశాలు జారీ చేయకపోయినా పర్వాలేదు కానీ మళ్ళీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తే తమిళనాడు ఎన్నికల సంఘం పరువు పూర్తిగా పోవడం ఖాయం.