కరోనా సోకి ఆసుపత్రిలో చేరవలసి వస్తే అదో పెద్ద కష్టం! కరోనాతో చచ్చినా అంతకంటే పెద్ద కష్టమే! రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెపుతున్న మాటలకి వాస్తవాలకి ఎక్కడా పొంతన ఉండటం లేదు. రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరేందుకు సుమారు 10-12 మంది రోగులు అంబులెన్సులలో వచ్చారు. అప్పుడు రాత్రి 11 గంటలు. ఎంతసేపు ఎదురుచూసినా వారిని చేర్చుకోలేదు. ఆసుపత్రిలో బెడ్స్ ఖాళీ లేవని కనుక చేర్చుకోలేమని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో వారందరూ అర్ధరాత్రిపూట తమ ప్రాణాలను కాపాడే ఆసుపత్రుల కోసం అంబులెన్సులలో హైదరాబాద్ నగరంలో తిరగాల్సివచ్చింది.
ఇదిలా ఉంటే కరోనాతో చనిపోతే దిక్కులేని చావు చచ్చినట్లవుతోంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుమారు 300 మంది వరకు చనిపోయారు. వారిలో నిరుపేద కుటుంబాలకు చెందినవారే ఎక్కువ. ఆసుపత్రి నుంచి శవాలను తీసుకువెళ్లాలంటే పోలీస్‌స్టేషన్ నుంచి నిరంభ్యంతర సర్టిఫికేట్ (ఎన్‌ఓసీ) తీసుకురమ్మని ఆసుపత్రి సిబ్బంది చెపుతున్నారు. ఎలాగో కష్టపడి ఎన్‌ఓసీ తెచ్చుకొన్నా శవాన్ని తరలించాలంటే అంబులెన్స్ సిబ్బంది అడిగినంత డబ్బు ముట్టజెప్పాల్సిందే. అది చెల్లించి శవాన్ని శ్మశానానికి తీసుకువెళితే అక్కడ దహనం చేయడానికి వేలరూపాయలు చెల్లిస్తే తప్ప కట్టె కాలడం లేదు.
ఓ పక్క ఆత్మీయులు చనిపోయారనే బాధ, ఆవేదన చెందుతుంటే ఈ కష్టాలు, బాధలు కూడా భరించక తప్పడం లేదు. అంత డబ్బులేని పేదలు తమ ఆత్మీయుల శవాలను గాంధీ ఆసుపత్రిలోనే వదిలేస్తున్నారు. దాంతో గాంధీ మార్చూరీలో శవాలు పేరుకుపోతున్నాయి.
హైదరాబాద్ నగరం నలుమూలల అనేక శ్మశానవాటికలున్నప్పటికీ కరోనా రోగుల శవాలను కేవలం నాలుగు శ్మశానాలలోనే అనుమతిస్తున్నారు. అది కూడా అన్ని దృవపత్రాలు ఉండి అడిగినంత డబ్బు చెల్లిస్తేనే!కష్టకాలంలో ప్రజలను ఆదుకోకపోతే వారి నమ్మకాన్ని కోల్పోతామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నిన్ననే చెప్పారు. కానీ హైదరాబాద్‌లోనే ఇటువంటి దయనీయమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని మీడియా ఫోటోలు, వీడియోలతో సహా రోజూ కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నా ఎవరికీ కనిపించడం లేదా...వినిపించడం లేదా?అని కరోనా రొగులు, కరోనాతో చనిపోయినవారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.