తెలంగాణ రాష్ట్రంలో ఏ పెద్ద సమస్య వచ్చినా టిఆర్ఎస్ మంత్రులు కేంద్రాన్ని నిందిస్తుండటం, అప్పుడు రాష్ట్ర బిజెపి నేతలు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం పరిపాటిగా మారిపోయింది. ఇది తెలంగాణ ఒక్క రాష్ట్రానికే కాదు దేశంలో బిజెపియేతర అన్ని రాష్ట్రాలలో ఇదే తంతు కొనసాగుతుంటుంది. ఈ కరోనా విపత్కాలంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర అవగాహనతో ముందుకు సాగుతూ సమర్ధంగా కరోనాను ఎదుర్కోవలసి ఉండగా మళ్ళీ ఇదేవిదంగా వ్యవహరిస్తుండటం చూసి ప్రజలు అసహ్యించుకొంటున్నారని గ్రహించడం లేదు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “ఆక్సిజన్ లేక కరోనా రోగులు చనిపోతుండటం దేశానికే అవమానకరం. దీంతో ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోతారు. రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్లను, ఆక్సిజన్‌ను కేంద్రప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకొని కూర్చోంటే రాష్ట్ర బిజెపి నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదు. రాష్ట్రానికి రోజుకి 600 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రాన్ని అడిగితే కేవలం 306 టన్నులు కేటాయించింది. ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రప్రభుత్వం మా సలహాలు సూచనలను అసలు పట్టించుకోకుండా తనకు తోచినట్లు వ్యవహరిస్తుండటం చాలా బాధాకరం. ఇకనైనా రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్, వాక్సిన్లు తక్షణమే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాను.
మే 1 నుంచి 18-48 ఏళ్ళలోపు వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. వారికి కూడా వేయాలంటే తెలంగాణకు మరో 3.5 కోట్ల టీకాలు కావాలి. కానీ రెండు కంపెనీల ఉత్పత్తి కలిపి కేవలం ఆరు కోట్లే అని కేంద్రం చెపుతోంది. మరి ఏవిదంగా అందరికీ టీకాలు ఇవ్వగలము?కేంద్రప్రభుత్వం సహకరించనప్పటికీ రాష్ట్రంలో కరోనా రోగులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది,” అని అన్నారు.
అయితే మంత్రి ఈటల రాజేందర్ చెపుతున్నదానికి వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందని ఆసుపత్రులు చుట్టూ తిరుగుతున్నవారిని, ఆసుపత్రులు, శ్మశానాల దగ్గర పడిగాపులు కాస్తున్నవారిని చూస్తే అర్ధమవుతుంది. కనుక మంత్రి ఈటల స్వయంగా ఆసుపత్రులు, టెస్టింగ్ కేంద్రాల వద్దకు వెళ్ళి వాస్తవ పరిస్థితులను కళ్ళారా చూసి యుద్ధప్రాతిపదికన అవసరమైన ఏర్పాట్లు చేస్తే ప్రజలు హర్షిస్తారు. అలాకాక ఈ విపత్కాలంలో కేంద్రాన్ని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తే ఆయన చెప్పినట్లే...ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంటుంది.