రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంటే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ అంశంపై నేడు విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో మండిపడింది. “ఓ పక్క మనుషుల ప్రాణాలు పోతున్నా మీకు పట్టదా?మనుషుల ప్రాణాల కంటే ఎన్నికలే మీకు ముఖ్యమా? చుట్టూ ఏమి జరుగుతున్నా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న మీరు (ఎన్నికల అధికారులు) ఈ భూమ్మీద ఉన్నారా లేక ఆకాశంలో ఉన్నారా?ఎన్నికలను వాయిదా వేసే అధికారం మీకు లేదా?కనీసం ఎన్నికల ప్రచార సమయాన్ని ఎందుకు కుదించలేదు?కరోనా జాగ్రత్తలు పాటించకుండా ఎన్నికల ప్రచారం జరుగుతుంటే మీరేం చేస్తున్నారు?అసలు కరోనా రెండో దశ మొదలైన తరువాత ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు?అంటూ ప్రశ్నలు, విమర్శల వర్షం కురిపించింది. వీటికి ఎన్నికల సంఘం అధికారులు చెప్పిన సమాధానాలపై కూడా హైకోర్టు మళ్ళీ మండిపడింది. చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఘాటుగా విమర్శించింది.
ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఆక్షేపణలు నూటికి నూరు శాతం సరైనవే. అయితే మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత షబీర్ అలీ తదితరులు పిటిషన్ వేసినప్పుడు ఈ దశలో కలుగజేసుకోలేమని హైకోర్టు చెప్పింది. హైకోర్టు తలుచుకొంటే అప్పుడే ఎన్నికలను వాయిదా వేయించగలిగి ఉండేది లేదా కనీసం ఎన్నికల ప్రక్రియను కుదించగలిగి ఉండేది. కానీ అప్పుడు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని చెప్పి ఇప్పుడు తప్పులెంచి చూపుతూ ఆక్షేపించడం వలన ఏమి ప్రయోజనం?
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వం కనుసన్నలలో నడుస్తోందని, అందుకే కరోనా పరిస్థితులను పట్టించుకోకుండా ఎన్నికల నిర్వహిస్తోందని రాష్ట్రంలో ప్రతిపక్షాలు పదేపదే విమర్శలు చేశాయి. అయినా ఆ విమర్శలను పట్టించుకోకుండా ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది.
రాష్ట్రంలో కరోనా ముప్పు పెరిగితే అది ప్రభుత్వానికి కూడా అనేక సమస్యలను సృష్టిస్తుందని తెలిసి ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఎన్నికలకే మొగ్గు చూపింది. కనుక తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు దీనికి ప్రభుత్వం, ఎన్నికల సంఘం, హైకోర్టు మూడు కూడా బాధ్యులే అని చెప్పక తప్పదు. కానీ రేపు పోలింగ్ పెట్టుకొని ఇప్పుడు వగచి ఏం ప్రయోజనం? ఎంత నష్టమైనా...ఎంతమందికి కరోనా సోకినా భరించాల్సిందే కదా!