నరేంద్రమోడీ తొలిసారిగా 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు యావత్ దేశం ఆయనపై చాలా ఆశలు పెట్టుకొంది. అందుకు తగ్గట్లే ఆయన పనిచేసి దేశప్రజలను మెప్పించారు కూడా. అయితే అధికారం చేపట్టిన రెండేళ్లకే నోట్లరద్దుతో తొలిసారిగా దేశప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఆ అనాలోచిత నిర్ణయానికి దేశంలో ప్రతీఒక్కరూ మూల్యం చెల్లించకతప్పలేదు. కానీ పాక్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ జరుపడం ద్వారా మళ్ళీ ప్రజాభిమానాన్ని పొందగలిగారు. ఆదే ఊపులో మళ్ళీ రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచే మోడీ ప్రభుత్వ పనితీరులో చాలా మార్పు వచ్చిందని విదేశీ మీడియా వాదిస్తోంది.
కరోనాతో భారత్ దుస్థితిపై వివిద దేశాల మీడియా విశ్లేషణాత్మక కధనాలను ప్రచురిస్తున్నాయి. వాటి సారాంశం ఏమిటంటే...ప్రధాని నరేంద్రమోడీ భారత్‌ను రక్షించుకోవాలా లేక తన సొంత ఇమేజిని కాపాడుకోవాలా... అనే రెంటిలో రెండో దానికే ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే భారత్‌కు ఈ దుస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాల నిర్లక్ష్యం, వైఫల్యాలే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
గత ఏడాది మొదటిసారిగా భారత్‌లో కరోనా ప్రవేశించినప్పుడు, ఎవరినీ సంప్రదించకుండానే ఏకపక్షంగా దేశంలో లాక్‌డౌన్ విధించి, లక్షలాది వలస కార్మికులను రోడ్డున పడేశారు. లాక్‌డౌన్‌తో కరోనా కట్టడి చేయగలిగారు కానీ దేశవ్యాప్తంగా చిన్నా, పెద్ద వ్యాపార సంస్థలు, పరిశ్రమలు చితికిపోయాయి. నేటికీ అవి కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. అందుకు కేంద్రప్రభుత్వం ఏమాత్రం పశ్చాతాపం వ్యక్తం చేయలేదు.
లాక్‌డౌన్‌తో కరోనా తీవ్రత తగ్గిపోగానే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలు భుజాలు చరుచుకొంటూ ఎన్నికలకు సిద్దమైపోయారు తప్ప కరోనా మహమ్మారి నుంచి ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోలేదు. ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోలేదు. ఆ నిర్లక్ష్యమే...ఆ అలసత్వమే... నేడు భారత్ దుస్థితికి ప్రధాన కారణమని విదేశీ మీడియా చెపుతోంది.
యావత్ ప్రపంచంలోకెల్లా అత్యధికంగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్న భారత్, ఇప్పుడు భారత్ పౌరులకు సకాలంలో వాక్సినేషన్ చేయించలేకపోయినందునే దేశంలో ఈ ఉపద్రవం సంభవించిందని, దీనికి భారత ప్రభుత్వ అలసత్వమే కారణమని విదేశీ మీడియా పేర్కొంది.
కరోనా గురించి పూర్తి అవగాహన ఏర్పడిన తరువాత మళ్ళీ వస్తే దానిని ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకొని సిద్దంగా ఉండవలసిన మోడీ ప్రభుత్వం, అటువంటి ఆలోచన చేయకుండా....ఎటువంటి కరోనా జాగ్రత్తలు పాటించకుండా నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు నిర్వహించింది. హిందూ ఓటు బ్యాంక్ కోసం లక్షలాదిమందితో హరిద్వార్‌లో కుంభమేళాకు అనుమతించింది. ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు, వైఫల్యాలు, అలసత్వమే భారత్ కొంప ముంచిందని విదేశీ మీడియా అభివర్ణిస్తోంది. కనీసం ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొంటోందా...అంటే అదీ లేదు!
ఓ వైపు వ్యాక్సిన్ కొరత వేదిస్తుంటే హడావుడిగా 18 ఏళ్ళు పైబడినవారందరికీ వాక్సినేషన్ చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వ్యాక్సిన్‌కు డిమాండ్ మరింత పెరిగి కొరత మరింత పెరిగిపోతుంది. దీంతో వాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే దానిని కట్టడి చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలీని అయోమయంలో భారత్ ప్రభుత్వం ఉందిప్పుడు అని విదేశీ మీడియా వాదిస్తోంది. ఇది స్వయంకృతాపరాధామే కనుక విదేశీ మీడియాను తప్పు పట్టడానికి లేదు.