దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో కేంద్రప్రభుత్వం మే 1వ తేదీ నుండి 18 ఏళ్ళకు పైబడినవారికి కూడా కరోనా టీకాలు వేయాలని నిర్ణయించింది. దాని కోసం బుదవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆరోగ్యసేతు లేదా కోవిన్ లేదా ఉమాంగ్ మొబైల్ యాప్‌లలో దేనిలోనైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికోసం ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకొన్న తరువాత ఆయా రాష్ట్రాలలో అందుబాటులో ఉన్న కరోనా టీకాలు, టీకా కేంద్రాలను బట్టి టీకాలు వేసుకొనేందుకు అవకాశం కల్పించబడుతుంది.
అయితే ఇక్కడే కేంద్రప్రభుత్వం చిన్న మెలిక పెట్టింది. కేంద్రం పంపిణీ చేస్తున్న టీకాలను 45 ఏళ్ళు పైబడినవారికి మాత్రమే వినియోగించాలని,18-45 ఏళ్ళలోపు వారికి వినియోగించకూడదని స్పష్టం చేసింది. వారికోసం ఆయా రాష్ట్రాలే టీకాలు కొనుగోలుచేసి ఇవ్వాలని స్పష్టం చేసింది.
కనుక 18-45 ఏళ్ళలోపు వారు టీకాల కోసం నేడు రిజిస్ట్రేషన్ చేసుకొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు టీకాలు కొనుగోలుచేసి అందజేస్తేనే టీకాలు పొందగలరు లేకుంటే ప్రైవేట్ ఆసుపత్రులలో ఒక్కో డోస్‌కు రూ.600 లేదా మరికొంచెం ఎక్కువ చెల్లించి వేసుకోవలసి ఉంటుంది. అయితే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అందరికీ ఉచితంగా టీకాలు వేయిస్తామని ప్రకటించినందున నేటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొనేవారికి కూడా ఉచితంగానే కరోనా టీకాలు వేస్తారు. అయితే టీకాల లభ్యత, టీకా కేంద్రాల ఏర్పాటును బట్టి టీకాలు లభించనున్నాయి.