మంత్రి ఈటల మళ్ళీ అదే పాత పాట?

April 27, 2021


img

గత ఏడాది రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా రోగులను దోచుకొన్నాయి. అప్పుడు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వాటిపై సింహంలా గర్జించారు. కానీ ఆయన గర్జనలను, హైకోర్టు, చివరికి సిఎం కేసీఆర్‌ హెచ్చరికలను అవి పట్టించుకొన్న దాఖలాలు లేవు. మళ్ళీ ఇప్పుడు అదే తంతు మొదలైంది. 

హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ నిండిపోయాయని రోజూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా రోగులను దోచుకొంటున్నాయని, బెడ్లకు కృత్రిమ కొరత సృష్టించి అందినకాడికి పిండుకొంటున్నాయని, ప్రభుత్వాసుపత్రులలో ఆక్సిజన్ సౌకర్యం లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రోజూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఎప్పటిలాగే మళ్ళీ పాతపాటే పాడారు. ప్రభుత్వం నిర్దేశించిన చార్జీల కంటే అదనంగా వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై కటిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.  

రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని యుద్ధవిమానాలతో ఆక్సిజన్‌ రప్పించుకొన్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణయే అని కితాబు ఇచ్చుకొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,000 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయని, 600 పడకలతో ఐసీయు కలిగిన గాంధీ ఆసుపత్రి దేశంలోకెల్లా అతిపెద్ద కరోనా ఆసుపత్రిగా నిలుస్తోందని చెప్పారు. వారం రోజులలోగా టిమ్స్ గచ్చిబౌలీ, నీమ్స్ హైదరాబాద్‌, వరంగల్‌, సూర్యాపేట, నల్గొండ తదితర జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులలో 3,010 పడకలకు ఆక్సిజన్ లైన్స్ వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కొత్తగా ఆక్సిజన్‌ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి రోజుకు 270 టన్నుల ఆక్సిజన్‌ అవసరం కాగా రోజుకు 400 టన్నులు వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. 

కనుక మంత్రి ఈటల చెప్పినదాని ప్రకారం రాష్ట్రంలో ఎక్కడా బెడ్లు కొరత లేదు...ఆక్సిజన్ కొరత అసలే లేదు. ప్రైవేట్ ఆసుపత్రులు ఇకపై రోగులను పీడించకుండా కరోనా రోగులకు వైద్య సేవలందిస్తాయని భావించాలేమో?


Related Post