తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం

April 27, 2021


img

హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కరోనా కట్టడికి తీసుకొంటున్న చర్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక సమర్పించింది. దానిపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తాము పదేపదే చెపుతున్న ప్రభుత్వం మాత్రం ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనాతో మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం కరోనాను సీరియస్‌గా తీసుకొన్నట్లు లేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇళ్ళలోనే ఉంటూ కరోనా చికిత్స తీసుకొంటున్నవారికి సాయపడేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన హితం మొబైల్ యాప్‌ను ఎందుకు నిర్వహించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దానిని మళ్ళీ యాక్టివేట్ చేయాలని ఆదేశించింది. 

పురపాలక ఎన్నికలతో రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం కనిపిస్తోందని, కనుక ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం  ఏమి చర్యలు తీసుకొన్నాయని ప్రశ్నించింది. ఈనెల 30న పోలింగ్ జరుగబోతున్నందున పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి జాగ్రత్తలు తీసుకొంటున్నారో ఈనెల 29లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 

రాష్ట్రంలో కరోనా పరిస్థితి నానాటికీ దిగజారుతుంటే హైకోర్టు జోక్యం చేసుకొని ప్రభుత్వాన్ని మందలిస్తుండటం అభినందనీయమే కానీ ప్రతీసారి హైకోర్టు కరోనా నివేదికలు అడగటం, ప్రభుత్వం వాటిని సమర్పించడం...వాటిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడం...ఈ తంతు గత ఏడాదిగా కొనసాగుతూనే ఉంది తప్ప వాటితో ఎటువంటి మార్పు, ఫలితం కనబడటం లేదు.


Related Post