ఎన్నికల ప్రచారాన్ని పట్టించుకోని ఈసీ....

April 27, 2021


img

ఇటీవల తెలంగాణతో సహా వివిద రాష్ట్రాలలో జరిగిన ఉపఎన్నికలు, పుదుచ్చేరితో సహా అస్సాం, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీ, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల నేతలు వేలాదిమందితో భారీ బహిరంగసభలు, ర్యాలీలు నిర్వహించారు. దేశంలో ఓ పక్క కరోనా విలయతాండవం చేస్తుంటే పాలకులు, పార్టీల నేతలు ఏమాత్రం ఆలోచించకుండా ఎన్నికల ప్రచారం చేస్తుంటే, వారిని అడ్డుకొని నియంత్రించవలసిన కేంద్రరాష్ట్ర ఎన్నికల సంఘాలు చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చొన్నాయి. ఈవిషయంలో న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోవడానికి ఇష్టపడలేదు. దాంతో ఏమాత్రం కరోనా జాగ్రత్తలు పాటించకుండా అందరూ యధేచ్చగా ఎన్నికల ప్రచారం చేసుకొన్నారు. 

ఆ ప్రచారంలో పాల్గొన్న పలువురు నేతలు, ప్రజలు, వివిద శాఖల అధికారులు, సిబ్బంది, చివరికి బందోబస్తులో విధులు నిర్వహించిన పోలీసులు కూడా కరోనా బారినపడ్డారు. ఏమాత్రం కరోనా జాగ్రత్తలు పాటించకుండా వేలాదిమందితో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు చేతులు ముడుచుకొని కూర్చోన్న కేంద్ర ఎన్నికల కమీషన్, మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు ఎవరూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని హుకుం జారీ చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. చేతులు కాలిన తరువాత ఇప్పుడు ఆకులు పట్టుకొన్నట్లు దేశంలో కరోనా తీవ్రత పెరిగిపోయిన తరువాత ఈ కంటి తుడుపు చర్య వలన ప్రయోజనం ఏమిటి?అయినా ఎన్నికల కమీషన్ చెపితే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు, వాటి నేతలు వినే పరిస్థితిలో ఉన్నారా?ఎన్నికల ప్రచారంలో ఉల్లంఘనలకు పాల్పడితే ఏమీ చేయలేకపోయిన ఎన్నికల కమీషన్, ఇప్పుడు ఎన్నికలలో గెలిచిన రాజకీయాపార్టీలు విజయోత్సవర్యాలీలు జరుపుకొంటే ఏమైనా చేయగలదా?   



Related Post