ఎన్నికలతోనే దేశంలో కరోనా విస్పోటనం?

April 26, 2021


img

కరోనా విషయంలో అటు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, వివిద వ్యవస్థలు, ప్రజలు అందరూ కూడా చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పక తప్పదు. అందుకే నేడు దేశంలో కరోనా తీవ్రత ఇంతగా పెరిగిపోయింది. మొదటిసారి దేశంలోకి కరోనా ప్రవేశించినప్పుడు ఆరంభశూరత్వం ప్రదర్శించి కట్టడిచేసిన ప్రభుత్వాలు, వ్యవస్థలు, సమాజమే కరోనా రెండో దశ మొదలయ్యే ముందు చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి ఈ దుస్థితి కొనితెచ్చుకొన్నాయి. 

కరోనా విలయతాండవం చేస్తోందని స్కూళ్ళు, కాలేజీలు మూసుకొన్న కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, కరోనా విస్పోటనానికి దారితీసే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాయి. నేటికీ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉండి. కనుక ఎన్నికల ప్రచారం కూడా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ ఉపఎన్నికల హడావుడి ముగియగానే మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైపోయింది. సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలకే కరోనా సోకినా ఎన్నికల హడావుడి మాత్రం ఆగలేదు కనీసం తగ్గలేదు. ఇందుకు సంతోషించాలా...బాధపడాలా?    

ఈ ఎన్నికల ప్రక్రియలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రరాష్ట్ర ఎన్నికల కమీషన్, రాజకీయ పార్టీలు, పాలకులు, ప్రతిపక్ష నేతలు, ప్రజలూ అందరూ తలోచెయ్యి వేయడంతో ఎన్నికల ప్రక్రియ ముగిసేసరికి దేశంలో కరోనా విస్పోటనం మొదలైంది. ఎన్నికల ప్రక్రియ మొదలవక మునుపు రోజుకు లక్షలోపు కేసులుండే భారత్‌లో ఇప్పుడు రోజుకు 3.50 లక్షల కేసులు నమోదవుతుందటమే అందుకు తాజా నిదర్శనం.  

మొదటిసారి లాక్‌డౌన్‌ విధించిన కేంద్రప్రభుత్వం, ఇప్పుడు సమస్యను రాష్ట్రాలకు అప్పజెప్పేసి చేతులు దులుపుకొంది. ఇప్పటికే రాష్ట్రాల ఆదాయం అంతంతమాత్రంగా ఉండటంతో కరోనా కేసులు ఎంతగా పెరిగిపోతున్నప్పటికీ లాక్‌డౌన్‌ విధించడానికి వెనకాడుతున్నాయి. కానీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో ఇప్పుడు కర్ఫ్యూ పేరిట లాక్‌డౌన్‌ విధించక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రేపటి నుంచి కర్ణాటకలో 2 వారాలపాటు కర్ఫ్యూ అమలుచేయబోతున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ఈరోజు ప్రకటించడమే అందుకు తాజా ఉదాహరణ. అయితే లాక్‌డౌన్‌తో కరోనా తీవ్రతను తగ్గించవచ్చు కానీ పూర్తిగా నివారించలేమని స్పష్టమైంది కనుక మందులు, ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌  సరఫరాను మెరుగుపరుచుకొని, అందరికీ మరింత త్వరగా టీకాలు వేయడం మాత్రమే పరిష్కార మార్గాలుగా కనిపిస్తున్నాయి. 


Related Post