ఎన్నికల సంఘం వేరే గ్రహం మీద ఉందా? హైకోర్టు ప్రశ్న

April 26, 2021


img

దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంటే కేంద్రరాష్ట్ర  ఎన్నికల సంఘాలు ఎన్నికలు నిర్వహించడం, అధికారంపై యావతో రాజకీయపార్టీలు...వాటి నేతలు వేలాదిమందితో ఎన్నికల సభలు, ర్యాలీలు నిర్వహించడంపై ఇంతవరకు ఎవరూ గట్టిగా ప్రశ్నించలేకపోయారు. రాంగోపాల్ వర్మ వంటి కొందరు ధైర్యం చేసి ప్రశ్నించినా ఎవరూ పట్టించుకోలేదు. ఎట్టకేలకు మద్రాస్ హైకోర్టు తమిళనాడు ఎన్నికల సంఘాన్ని గట్టిగా నిలదీసి ప్రశ్నించింది. 

కరోనా సమయంలో రాజకీయ పార్టీలను ఎన్నికల ప్రచారానికి అనుమతించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు, ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “రాష్ట్రంలో రెండో దశ కరోనా వ్యాప్తికి ఎన్నికల సంఘమే కారణం. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి కారణమైన ఎన్నికల సంఘంపై హత్య నేరం మోపవలసి ఉంటుంది. ఓ పక్క రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే, ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను సభలు, ర్యాలీలలకు ఎలా అనుమతించింది?ఎన్నికల ర్యాలీలలో ఎవరూ కరోనా జాగ్రత్తలు పాటించకపోయినా ఎన్నికల అధికారులు ఎందుకు పట్టించుకోలేదు?ఆ సమయంలో మీరందరూ వేరే గ్రహం మీద ఉన్నారా లేక తమిళనాడులోనే ఉన్నారా?ప్రజలకు జీవించే హక్కును కాలరాసే అధికారం ఏ వ్యవస్థకూ లేదు. కానీ ప్రజల ఆ ప్రాధమిక హక్కుకి భంగం కలుగుతుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. కనీసం ఓట్ల లెక్కింపుకైనా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా? లేకుంటే ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపివేస్తాము. ఈ నెల 30లోగా దీనికి సంబందించి సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్రరాష్ట్ర ఎన్నికల సంఘాలను, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిని ఆదేశించింది. 

ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను తప్పు పట్టలేము కానీ కరోనాతో ప్రాణాలు పోతున్నాయని తెలిసి ఉండి కూడా ప్రధాని, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి మొదలు స్థానిక ప్రజాప్రతినిధుల వరకు అందరూ ఏమాత్రం జాగ్రత్తలు పాటించకుండా వేలాదిమందితో సభలు, ర్యాలీలు నిర్వహించడం చాలా బాధ్యతారాహిత్యమే అని చెప్పకతప్పదు. అదే... మద్రాస్ హైకోర్టు నేడు చెప్పింది. పాలకులే ఇంత బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తూ భారత్‌ను అమెరికా లేదా మరో దేశమో ఆదుకోవాలని ఎదురుచూడటం సిగ్గుచేటు కదా?


Related Post