ఊపిరి తీస్తున్న కరోనా మహమ్మారి

April 24, 2021


img

గత ఏడాది కంటే ఈసారి కరోనా మహమ్మారి మరింత శక్తివంతంగా తయారైంది. ఇప్పుడు ప్రజల శ్వాసకోశ వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపుతూ ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీస్తోంది. దీంతో దేశంలో హటాత్తుగా ఆక్సిజన్‌కు భారీగా డిమాండ్ పెరగడంతో ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. ఈ కారణంగా ఢిల్లీలో పలు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిలువలు నిండుకోవడంతో రోగులు చనిపోతున్నారు. 

ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రులలో ఒకటైన సర్ గంగారాం హాస్పిటల్‌లో ఆక్సిజన్ అందక గురువారం 25 మంది చనిపోయారు. ఇంకా అనేకమంది ఆక్సిజన్‌పై ఉన్నారని కనుక వెంటనే ఆక్సిజన్‌ సిలెండర్లు పంపించకపోతే వారందరూ చనిపోతారని ఆ హాస్పిటల్ యాజమాన్యం ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఫోన్‌ చేసి చెప్పడంతో ఆయన వెంటనే ఆక్సిజన్‌ కంపెనీతో మాట్లాడి రెండు ట్యాంకర్లు పంపించారు. 

ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ హాస్పిటల్‌లో శుక్రవారం రాత్రి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో 20 మంది రోగులు చనిపోయారు. ఈవిషయం ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డా.డికె బలూజా ప్రకటించారు. తమ ఆసుపత్రిలో 200 మంది రోగులు ఆక్సిజన్‌పై ఉన్నారని, కానీ తమ వద్ద మరో గంట సేపటికి సరిపడే ఆక్సిజన్‌ మాత్రమే ఉందని, కనుక అత్యవసరంగా ఆక్సిజన్‌ ట్యాంకర్లు పంపాలని ఈరోజు (శనివారం) ఉదయం 10 గంటలకు సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఫోన్‌ చేసి చెప్పారు. 

ఢిల్లీలోని మరో రెండు ప్రముఖ ఆసుపత్రులు మూల్‌చంద్ హాస్పిటల్‌, డాక్టర్ బాత్రా హాస్పిటల్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మూల్‌చంద్ ఆసుపత్రిలో 130 మంది, డాక్టర్ బాత్రా ఆసుపత్రిలో 265 మంది ఆక్సిజన్‌పై ఉన్నారని, కానీ తమ వద్ద మరో రెండు గంటలకు సరిపడే ఆక్సిజన్‌ మాత్రమే నిలువ ఉందని, కనుక తక్షణం ఆక్సిజన్‌ ట్యాంకర్లు పంపించాలని ఆ హాస్పిటల్ యాజమాన్యాలు కోరాయి. ఒకవేళ సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్లు వస్తే వారందరూ ప్రాణాలతో ఉన్నట్లు లేకుంటే లేనట్లు.

 ఇది ఒక్క ఢిల్లీకి సంబందించిన సమస్య మాత్రమే కాదు. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌, బెంగళూరు, రాయ్‌పూర్, భోపాల్ వంటి అనేక నగరాలలో...ఇంకా దేశంలో వేలాది చిన్న చిన్న పట్టణాలలో కూడా ఇదే పరిస్థితి. కనుక భారత్‌కు ఊపిరాడని పరిస్థితిలో ఉందిపుడు.


Related Post