భారత్‌కు ఏమైంది?

April 24, 2021


img

గత ఏడాది లాక్‌డౌన్‌ విధించినప్పుడు దేశవ్యాప్తంగా లక్షలాదిమంది వలస కార్మికులు, భార్యా పిల్లలను వెంటబెట్టుకొని వేలాదికిలోమీటర్లు కాలినడకన నడిచి తమ స్వగ్రామాలకు చేరుకొన్నారు. మండు వేసవిలో ఆకలిదప్పులతో అలమటిస్తూ కాలినడకన తమ గ్రామాలకు చేరుకొన్నవారెందరో...దారిలోనే ప్రాణాలు కోల్పోయినవారెందరో...ఎక్కడా లెక్కలు లేవు. ఆనాడు వారి దుస్థితిని చూసి కంట తడిపెట్టని భారతీయుడు లేడని చెప్పవచ్చు. కానీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం చేతులెత్తేశాయి. అనాడదో మహా విషాదకరమైన విచిత్రం. 

ఏడాది గడిచిన తరువాత ఇప్పుడు దేశంలో మరో విచిత్ర పరిస్థితులు కనబడుతున్నాయి. దేశంలో కరోనా కారణంగా చాలా మంది ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులుపడుతూ ఆసుపత్రులలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆసుపత్రులన్నీ నిండిపోవడం లేదా ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆక్సిజన్ సిలెండర్లు తగిలించుకొని వాహనాలలో తిరుగుతున్న రోగులు కనిపిస్తున్నారు. గ్యాస్ సిలెండర్ తప్ప ఏనాడూ ఆక్సిజన్ సిలెండర్ వాడని ప్రజలు ఇప్పుడు అవి ఎక్కడ దొరుకుతాయో వెతికివెతికి పట్టుకొని తెచ్చుకొంటున్నారు. ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రైళ్ళలో, విమానాలలో తీసుకువచ్చి సరఫరా చేస్తున్నాయి. 

గత ఏడాది వలస కార్మికులకు ఎదురైన దుస్థితి, ఇప్పుడు ఆక్సిజన్ కొరకు తిప్పలు రెండూ స్వయంకృతాపరాధాలే అని అందరికీ తెలుసు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకొంటే వలస కార్మికులకు ఆనాడు ఆ కష్టాలు లేకుండా చేయగలిగి ఉండేవి కానీ చేయలేదు. ఏడాదిగా కరోనా నేర్పిన పాఠాలతో దేశంలో ఆక్సిజన్ ప్లాంట్లతో సహా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకొని ఉండవచ్చు కానీ చేసుకోలేదు. చేతులు కాలకుండా జాగ్రత్తపడే బదులు కాలాక ఆకులు పట్టుకోవడమే ఓ అలవాటుగా మారిపోయిందనిపిస్తోంది.


Related Post