మమత ఆ కుర్చీని ఇంకా ఎప్పుడు వదులుతారో?

April 23, 2021


img

పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలలో ఇప్పటివరకు 6 విడతల పోలింగ్ పూర్తవగా ఏప్రిల్ 26,29 తేదీలలో మరో రెండు విడతలతో పోలింగ్ పూర్తవుతుంది. ఈసారి ఎన్నికలలో బిజెపి నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి పోటీ ఎదుర్కొంటుండటంతో సిఎం మమతా బెనర్జీ ఈ ఎన్నికలలో మళ్ళీ ఎలాగైనా గెలిచి తన కుర్చీని కాపాడుకోవాలనుకొంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు తనపై బిజెపి కార్యకర్తలు దాడి చేశారని, ఆ దాడిలో కిందపడిపోయినప్పుడు కాలు ఫ్రాక్చర్ అయ్యిందని మమతా బెనర్జీ చెప్పారు. ఆమె ఆరోపణలను బిజెపి వెంటనే ఖండించింది. 

చుట్టూ భారీ సెక్యూరిటీ ఉండగా ముఖ్యమంత్రిగా ఉన్న ఆమెపై బిజెపి కార్యకర్తలు దాడిచేయడం...ఆ సందర్భంగా ఆమె కాలు విరగడం ఎంతవరకు నిజమో తెలీదు కానీ ఆ రోజు నుంచి ఆమె కాలికి సిమెంట్ కట్టు వేసుకొని చక్రాల కుర్చీలో కూర్చోనే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆమె ఆ కాలుని చూపిస్తూ ప్రజల సానుభూతిని...దాంతో బాటు వారి ఓట్లను సంపాదించుకోవాలని చవుకబారు జిమ్మిక్కులు చేస్తున్నారని, ఈ ఎన్నికలలో ఆమె పార్టీ ఓడిపోవడం...చివరికి ఆమె ఆ చక్రాల కుర్చీతోనే సరిపెట్టుకోవలసి ఉంటుందని రాష్ట్ర బిజెపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కానీ మమతా బెనర్జీ వాటిని పట్టించుకోకుండా చక్రాల కుర్చీలో కూర్చోనే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బహుశః ఈనెల 29న చివరి విడత పోలింగ్ కూడా పూర్తయ్యాకే ఆమె ఆ చక్రాల కుర్చీలో నుంచి లేస్తారేమో?


Related Post