ఒకప్పుడు తెలంగాణ కోసం కొట్లాడాము. తరువాత నిధుల కోసం కొట్లాడుతూనే ఉన్నాము. ఇప్పుడు ఆక్సిజన్, ఇంజక్షన్లు, వాక్సిన్ల కోసం కూడా కొట్లాడే పరిస్థితి దాపురించిందా?అంటే అవుననే చెప్పుకోవాలేమో!
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్రల నుంచి కూడా కరోనా చికిత్స కోసం రోగులు హైదరాబాద్ వస్తున్నారు. మానవతాదృక్పదంతో వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నాము. కానీ కేంద్రప్రభుత్వం మాత్రం ఎప్పటిలాగే మందులు, ఆక్సిజన్ సిలిండర్ల కొరకు మేము చేస్తున్న విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదు. మేము అత్యవసరంగా 4 లక్షల రెమిడెసివిర్ ఇంజక్షన్లు అడిగితే కేంద్రప్రభుత్వం 21,550 మాత్రమే ఇస్తామని చెప్పింది. కనీసం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న రెమిడెసివిర్ ఇంజక్షన్లను రాష్ట్రానికే కేటాయించాలని చెప్పినా పట్టించుకోవడం లేదు.
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత రోజురోజుకీ పెరుగుతుండటంతో దాని కోసం మా విన్నపాలపై కేంద్రం స్పందన సరిగా లేదు. రాష్ట్రానికి రోజుకి 384 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా 260-270 టన్నులు మాత్రమే వస్తోంది. మరో 30 టన్నులు తమిళనాడు నుంచి సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది కానీ తమిళనాడు ప్రభుత్వం ఒక్క టన్ను కూడా ఇవ్వలేమని ఖరాఖండీగా చెప్పేసింది. ఇక్కడ ఆసుపత్రులలో అనేకమంది రోగులకు ఆక్సిజన్ చాలా అవసరముంది. సమయానికి ఆక్సిజన్ అందించకపోతే వారి ప్రాణాలకే ముప్పు. కనుక కేంద్రప్రభుత్వం పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకొని రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, వాక్సిన్లు తక్షణమే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్రప్రభుత్వం మందులు, ఆక్సిజన్, వాక్సిన్లు అన్ని తన అధీనంలో పెట్టుకొని రాష్ట్రాలను ఈవిదంగా ఇబ్బందిపెట్టడం సరికాదని భావిస్తున్నాను,” అని అన్నారు.