ఇప్పుడిప్పుడే కరోనా వాక్సిన్లపై ప్రజలలో క్రమంగా అపోహలు, భయాలు తగ్గి టీకాలు వేయించుకొనేందుకు ముందుకు వస్తుండటంతో దేశంలో వేగంగా వాక్సినేషన్ ప్రక్రియ జోరందుకొంది. అందుకే ఇప్పుడు వాక్సిన్ల కొరత ఏర్పడుతోంది. పైగా దేశంలో కరోనా మహమ్మారి ఇప్పుడు విలయతాండవం చేస్తోంది. కనుక ఇప్పుడు మరింత వేగంగా వాక్సినేషన్ నిర్వహించేందుకు మరిన్ని ఎక్కువ డోసుల వాక్సిన్లు రాష్ట్రాలకు అందజేయాల్సి ఉండగా, జోరుగా సాగుతున్న వాక్సినేషన్ ప్రక్రియకు బ్రేకులు వేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం నిర్ణయాలు తీసుకొంటుండటం చాలా శోచనీయం. కేంద్రానికి ఒక్కో వాక్సిన్ డోస్ రూ.150 చొప్పున, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400 చొప్పున ధరలు ఖరారు చేసింది.
ఇన్ని కోట్లమందికి కేంద్రప్రభుత్వమే వాక్సినేషన్ చేయించడం చాలా కష్టమే! కానీ కరోనా కట్టడి విషయంలో రాష్ట్రాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్న ప్రధాని నరేంద్రమోడీ, కరోనా వాక్సిన్ ధరల విషయంలో ఎందుకు సంప్రదించలేదు?అనే సందేహం కలుగుతుంది.
గత ఏడాది నుంచి కరోనా కట్టడి, చికిత్సల ఖర్చుల ఆర్ధికభారం మోస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు, లాక్‌డౌన్‌లతో ఆదాయం కోల్పోయి చాలా ఇబ్బందికర పరిస్థితులలో ఉన్నాయి. కనుక దేశంలో చాలా రాష్ట్రాలు రూ.400 చొప్పున చెల్లించి ఒక్కో వాక్సిన్ డోసులను కొనుగోలు చేసే పరిస్థితిలో లేవు. ఈ కారణంగా అవి ప్రజలందరికీ వాక్సినేషన్ చేయించడానికి వెనకడుగువేస్తే కరోనా మహమ్మారి ఎప్పటికీ దేశాన్ని, రాష్ట్రాలను వెంటాడుతూనే ఉంటుంది. అప్పుడు దేశ, రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడుతుంది. అటువంటి దుస్థితి వద్దనుకొంటే కేంద్రప్రభుత్వం వాక్సిన్ ధర, సరఫరా గురించి రాష్ట్రాలతో సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది.