లాక్‌డౌన్ చివరి అస్త్రమని కనుక చేజేతులా అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన 24 గంటలలోనే మహారాష్ట్రలో పరిస్థితులు అదుపుతప్పి సంపూర్ణ లాక్‌డౌన్ విధించవలసివచ్చింది.
లాక్‌డౌన్‌తో కరోనా కేసులను తాత్కాలికంగా తగ్గించుకోవచ్చు కానీ పూర్తిగా వదిలించుకోలేమని ఇప్పటికే రుజువు అయ్యింది. అదే మళ్ళీ మరోసారి రుజువు అవుతుంది. ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో కరోనా కేసులు, మరణాల సంఖ్య శరవేగంగా పెరుగుతున్నాయి. కనుక నైట్ కర్ఫ్యూలు, వారాంతపు కర్ఫ్యూలు, పాక్షిక కర్ఫ్యూలను అమలుచేస్తున్నాయి. కానీ వాటితో తాత్కాలికంగానే కరోనా తీవ్రత తగ్గుతుంది తప్ప పూరిగా తగ్గదు కనుక ఏదో ఓ రోజు అన్నీ రాష్ట్రాలు మళ్ళీ లాక్‌డౌన్ విధించడం ఖాయంగానే కనిపిస్తోంది.
లాక్‌డౌన్‌తో కరోనా కేసులు తగ్గగానే అందరూ భుజాలు చరుచుకోవడం మొదలుపెడతారు. ఆ తరువాత లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం కోల్పోయిందంటూ ఉద్యోగులు, పెన్షనర్లకు కోతలు విధిస్తారు. ఆ తరువాత ఆదాయం పెంచుకోవడానికి మళ్ళీ మద్యం దుకాణాలను అనుమతిస్తారు. కానీ అది ఏమాత్రం సరిపోదు కనుక అన్నిటిపై పన్నులు పెంచి సామాన్య ప్రజలపై ఆ భారం మోపుతారు. మళ్ళీ మళ్ళీ ఈ భారాన్ని సామాన్య ప్రజలు మోయగలరా లేదా అని ఆలోచించకుండా ఈ తంతు కొనసాగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే కరోనాకు ఎన్ని సైడ్ ఎఫెక్టులున్నాయో అదేవిదంగా లాక్‌డౌన్‌లకు కూడా ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఉన్నాయని అర్ధమవుతోంది.
ఈవిషయం తెలిసి ఉన్నప్పటికీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి విషయంలో అలసత్వం ప్రదర్శించడం, ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోకపోవడం, కరోనా విలయతాండవం చేస్తోందని తెలిసి ఉన్నప్పటికీ వేలాదిమందితో ఎన్నికల సభలు, ర్యాలీలు నిర్వహించడం, కుంభమేళాను అనుమతించడం వంటి అనేకానేక పొరపాట్లు కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నాయి.
ఒకే పొరపాటు రెండుసార్లు చేయడమైంది కనుక కనీసం ఇప్పటికైనా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని కరోనా మహమ్మారి శాస్వితంగా ఉంటుందనే భావిస్తూ అందుకు తగ్గట్లుగా దేశవ్యాప్తంగా అవసరమైన ఏర్పాట్లు చేసుకొని, వ్యవస్థలు, సమాజం సజావుగా సాగిపోయేందుకు నూతన విధివిధానాలు రూపొందించుకొంటే మంచిది లేకుంటే దేశాన్ని కరోనా మహమ్మారి కబళించివేయడం ఖాయం.