మోడీ చెపుతున్నదేమిటి? జరుగుతున్నదేమిటి?

April 21, 2021


img

ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “లాక్‌డౌన్‌ అనేది చివరి అస్త్రం. పరిస్థితి అంతవరకు రాకూడదనుకొంటే తాళంచెవి మన చేతుల్లోనే ఉంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వాలే భరోసా కల్పించి వారిని స్వగ్రామాలకు వెళ్ళిపోకుండా ఆపుకోవాలసి ఉంది. వారికి ఆహారం, పని, ఆదాయానికి భరోసా కల్పించడం ద్వారా వారిని నిలుపుకోవచ్చు. ప్రపంచ దేశాలలో అన్నిటికంటే మనమే తక్కువ సమయంలో ఎక్కువమందికి కరోనా వాక్సిన్లు వేయగలిగాము. గత ఏడాది కరోనా గురించి ఏమాత్రం అవగాహన లేనప్పుడు దానిని ఎంతో సమర్ధంగా ఎదుర్కొన్నాము. ఈసారి మనం పూర్తి సన్నదతో ఉన్నాము కనుక అందరం కలిసికట్టుగా ఎదుర్కొని నిలువరిద్దాము,” అని అన్నారు. 

అయితే ప్రధాని నరేంద్రమోడీ చెప్పినదానికి పూర్తివ్యతిరేక పరిస్థితులు దేశంలో నెలకొన్నాయిప్పుడు. ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాలని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్రమంత్రులు, ఎంపీలు...భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించారు. ప్రతిపక్షాలు కూడా పోటీ పడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయి. కనుక కరోనా...లాక్‌డౌన్‌, కర్ఫ్యూల తలుపులు రాజకీయనేతలే తెరిచారని చెప్పక తప్పదు.       

లాక్‌డౌన్‌ ఆఖరి అస్త్రం కావాలని ప్రధాని నరేంద్రమోడీ చెపుతుంటే పలు రాష్ట్రాలు ఇప్పటికే జనతా కర్ఫ్యూ పేరిట లాక్‌డౌన్‌, వారం రోజుల లాక్‌డౌన్‌, వారాంతపు లాక్‌డౌన్‌లు, రాత్రి కర్ఫ్యూలు అమలుచేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

దాంతో మళ్ళీ ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌తో సహా పలు రాష్ట్రాల నుంచి వలస కార్మికులు సొంతూళ్ళకు వెళ్ళిపోతున్నారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్లు వారికి ఏ రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతోంది. ఒకవేళ ఇచ్చినా ఎవరూ ప్రభుత్వాలను నమ్మే పరిస్థితులలో వారు లేరు. 

ఈసారి పూర్తి సన్నదతో ఉన్నామని మోడీ చెప్పారు. అది కొంతవరకు నిజమే కావచ్చు. కానీ ఓ పక్క వాక్సిన్ల కొరత, మరోపక్క ఆక్సిజన్ సిలెండర్ల కొరత, టెస్టింగ్ కిట్స్ కొరత, మందుల కొరత, ఆసుపత్రులలో బెడ్ల కొరత ఇలా... ప్రతీదానికీ వెతుక్కొంటూ మనమే గొప్ప అని భుజాలు చరుచుకోవడం ఎందుకు? 


Related Post