కరోనా సీక్వెల్...మహా టెరిఫిక్

April 20, 2021


img

సాధారణంగా ఏదైనా ఒక సినిమా సూపర్ హిట్ అయితే వెంటనే దానికి సీక్వెల్ తీసినట్లుగానే, ఈ శతాబ్ధంలోనే సూపర్ హిట్‌గా నిలిచిన కరోనా మహమ్మారికి రిలీజ్ అయిన ఏడాదికే సీక్వెల్ వచ్చేసింది. అది కూడా సూపర్ హిట్ అయ్యింది. కనుక తరువాత కరోనా పార్ట్-3 కూడా వస్తుందేమో? సినిమా హిట్ అయితే జనం చప్పట్లు కొడతారు. దాని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అందరూ పండుగ చేసుకొంటారు. కానీ సీక్వెల్‌గా వచ్చిన ఈ కరోనాతో అందరూ హడలిపోతున్నారు. అంత భయానకంగా ఉందీ సీక్వెల్. 

హైదరాబాద్‌లో కరోనా దెబ్బకి ఇప్పటికే అనేక బజార్లు స్వచ్ఛందంగా మూసుకొంటున్నారు. షాపింగ్ మాల్స్ కళ తప్పాయి. మెట్రో రైళ్ళకు ప్రయాణికులు మొహం చాటేస్తున్నారు. ఒక్క మద్యం దుకాణాలు, పబ్బులు మాత్రమే ఇంకా కళకళలాడుతున్నాయి. కానీ నేటి రాత్రి నుంచి 10 రోజులపాటు రాష్ట్రంలో కర్ఫ్యూ అమలులోకి వస్తుంది కనుక వాటికీ కిక్కు దిగిపోతుంది. గత ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయిన సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, మెట్రో మెట్రో రైల్‌లో వగైరాలకు మళ్ళీ కరోనా కర్ఫ్యూ పోటు భరించక తప్పదు.      

అయితే ఈ సమస్య వాటికే కాదు..పీకలలోతు నష్టాలలో మునిగున్న టీఎస్‌ఆర్టీసీకి, అనేక చిన్నా పెద్దా దుకాణాలు, వ్యాపారసంస్థలకు ఉంటుంది. చివరికి ఐ‌టి కంపెనీల ఉద్యోగులపైనే ఆధారపడి రాత్రిపూట రోడ్లపక్కన నడిచే ఛాయ్, కాఫీ, ఫ్రూట్ జ్యూస్, ఐస్‌ క్రీమ్ దుకాణాలకు, టిఫిన్ సెంటర్లకు, చిరువ్యాపారులకు సైతం మళ్ళీ ఇబ్బందులు, నష్టాలు, కనీళ్ళు తప్పవు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తీరు చూస్తుంటే ఇంకా దీనికి పార్ట్ 3,4,5,6....ఉన్నాయేమోననే సందేహం కలుగుతోంది. ఒకవేళ నిజంగా అన్ని పార్టులు రిలీజ్ అయితే వాటిని చూసేందుకు ఈ భూమ్మీద ఎంతమంది మిగిలి ఉంటారో ఏమో? 


Related Post