ఏడాదిలో భారత్‌ పరిస్థితి తారుమారు!

April 20, 2021


img

గత ఏడాది యావత్ ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తున్నప్పుడు విదేశాల నుంచి వచ్చేవారి ద్వారానే భారత్‌లోకి కరోనా వైరస్ ప్రవేశిస్తున్నట్లు గుర్తించిన కేంద్రప్రభుత్వం వారిపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ వంటి అగ్రదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారిపై ఆంక్షలు విధించి కటినంగా అమలుచేసింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారు అయ్యింది. ఇప్పుడు భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తుండటంతో భారత్‌ నుంచి వస్తున్నవారిపై బ్రిటన్ ఆంక్షలు విధిస్తోంది. అమెరికా మరో అడుగుముందుకువేసి భారత్‌ ప్రయాణాలు మానుకోవాలని తమ పౌరులకు సూచించింది. హాంకాంగ్ ప్రభుత్వం భారత్‌కు మే 3వరకు విమానసేవలు రద్దు చేసింది. మరికొన్ని దేశాలు కూడా భారత్‌కు విమానసేవలు తాత్కాలికంగా నిలిపివేసేందుకు సిద్దమవుతుండటం గమనిస్తే, కరోనా కట్టడిలో భారత్‌ వైఫల్యానికి అది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 

యావత్ ప్రపంచానికి కరోనా వాక్సిన్లు అందించగల దేశమని మొదట్లో గొప్ప పేరు సంపాదించుకొని మొదట్లో అనేక దేశాలకు వాక్సిన్లను సరఫరా చేసిన భారత్‌ ఇప్పుడు వాక్సిన్ల కోసం ఇతరదేశాల ముందు చేయిజాపవలసి వస్తోంది! ఎందుకు? 

కరోనా గురించి ఏమీ తెలియనప్పుడు దానిని సమర్ధంగా ఎదుర్కొని యావత్ ప్రపంచదేశాల చేత జేజేలు పలికించుకొన్న భారత్‌ ఇప్పుడు ఇటువంటి దుస్థితి ఎదుర్కోవలసి రావడం మన వైఫల్యం, చేతగానితనమే అనుకోవాలేమో?ఎప్పుడూ ప్రజలు చైతన్యవంతులవ్వాలి లేదా వారిని చైతన్యపరచాలంటూ పలికే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలే ఇప్పుడు మేల్కొనాల్సి ఉంది. లేకుంటే భారత్‌లో కరోనా విస్పోటనం జరిగితే ఇక దానిని కట్టడి చేయడం ఎవరివల్లా సాధ్యం కాకపోవచ్చు. 


Related Post