మొదటి దశ కరోనా నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదా?

April 20, 2021


img

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల తీరు చూస్తుంటే మొదటి దశ కరోనా నుంచి ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోలేదనే అనిపిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరి-మార్చిలో దేశంలో తొలిసారి కరోనా ప్రవేశించిన తరువాత కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చాలా వేగంగా, సమన్వయంతో పనిచేస్తూ పీపీఈ కిట్లు, మాస్కూలు మొదలు ఎక్కడికక్కడ అవసరమైన ఆసుపత్రులు, క్వారెంటైన్‌ సెంటర్లు వంటివన్నీ ఏర్పాట్లన్నీ చేసుకొన్నాయి. ఆ అనుభవాలతో దేశంలో మళ్ళీ కరోనా వస్తే సులువుగా ఎదుర్కోగలిగి ఉండాలి. కానీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమవుతున్నాయని నానాటికీ పెరిగిపోతున్న కేసులు, మరణాలే చెపుతున్నాయి. 

నిజానికి గత ఏడాది కరోనా అనుభవాలతో ఏమేమి అవసరమో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు ముందే తెలుసు. కానీ ఇటువంటి క్లిష్టసమయంలో దేశంలో ఆక్సిజన్, మందులు, వాక్సిన్ల కొరత ఏర్పడటం విస్మయం కలిగిస్తోంది. దేనికీ కొరత లేదని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా వాదిస్తుండవచ్చు కానీ కొరత కళ్ళకు కనబడుతూనే ఉంది. 

కరోనా చికిత్సలో రెమిడిసివిర్ ఇంజక్షన్ మంచి ఫలితాలు ఇస్తుండటంతో దానికి డిమాండ్ పెరిగిపోయింది. దాంతో అది బ్లాక్ మార్కెట్‌లోకి వెళ్లిపోయింది. అత్యవసరమైన మందులు బ్లాక్ మార్కెట్‌లో అమ్మకానికి వెళ్ళిపోతున్నాయని రోజూ వార్తలు వస్తుంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయో తెలీదు. 

అదేవిదంగా కరోనా చికిత్సలో ఆక్సిజన్‌ది చాలా కీలకపాత్ర అని తెలిసి ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడా కొత్తగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోలేదు. దాహం వేసినప్పుడు నుయ్యి తవ్వడం మొదలుపెట్టినట్లు ఇప్పుడు ఆక్సిజన్ కొరత ఏర్పడిన తరువాత కేంద్రం హడావుడిగా ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌’ రైళ్లను పట్టాలెక్కిస్తోంది. గతానుభవాల నుంచి ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోకపోవడం వలననే ముందస్తు ఏర్పాట్లు చేసుకోలేదని అర్ధమవుతూనే ఉంది. ఆ కారణంగా ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ నడిపిస్తూ మళ్ళీ అదేదో ఘనకార్యమన్నట్లు గొప్పగా చెప్పుకోవడం హాస్యస్పదంగా ఉంది.

ఇక లాక్‌డౌన్‌ విధిస్తే వలస కార్మికులు ఎటువంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారో అందరూ కళ్ళారా చూశారు. అయినప్పటికీ వారి కోసం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, జనతా కర్ఫ్యూలు విధిస్తున్నాయి. వారం రోజుల ముందుగా ఆ విషయం ప్రకటిస్తే వారికి మళ్ళీ ఇన్ని కష్టాలు తప్పేవి కదా? అంటే వలస కార్మికులను ఉపయోగించుకోవడమే తప్ప వారి కష్టాలు, కన్నీళ్ళు ఎవరికీ పట్టావా? 


Related Post